Breaking News

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా పాజిటివ్


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నానని ఒబామా తెలిపారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను.. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను.. మిచెల్‌, నేను కోవిడ్ వ్యాక్సిన్‌ బూస్టర్ డోస్‌లూ తీసుకున్నాం. పరీక్షల్లో మిచెల్‌కు నెగెటివ్‌గా తేలింది. కేసులు తగ్గినప్పటికీ ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకొని వారుంటే వెంటనే తీసుకోండి’’ అని ఒబామా ట్వీట్‌ చేశారు. ఇక, ఒబామా కోవిడ్ నిర్ధారణ కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్‌లు వేగవంతం కావడంతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, అన్నిదేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతుంటే మహమ్మారి పుట్టిల్లు చైనాలో మాత్రం 2020 మార్చి తర్వాత అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈశాన్య న‌గ‌ర‌మైన చాంగ్‌చున్‌లో కొత్త కేసులు భారీగా బయటపడటంతో ఆ నగరంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్‌తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతోందని అధికారులు వెల్లడించారు. స్థానికులు ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని, కుటుంబంలో ఒక‌రే నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లాలని సూచించారు. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో రోజువారీ కేసులు ఒక దశలో 10 లక్షలు దాటిపోగా.. ఆ నెలలో సగటున 8 లక్షలు కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి రోజుకు 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి.


By March 14, 2022 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/former-us-president-barack-obama-tests-positive-for-coronavirus/articleshow/90195102.cms

No comments