లవ్యూ అమ్మా.. మమ్మల్ని బలి ఇవ్వడానికే పంపారు: బందీలుగా చిక్కిన రష్యా సైనికుల వీడియోలు వైరల్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో సైన్యంతో పాటు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే శత్రువులకు చిక్కినవారు బందీలుగా మారాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌పై ఎనిమిది రోజుల పోరులో కొందరు రష్యన్ సైనికులు ఉక్రెయిన్‌కు బందీలుగా చిక్కారు. వారిని కెమెరా ఎదుట కూర్చోబెట్టి ఉక్రెయిన్ అధికారులు ఇంటర్వ్యూ చేశాయి. మమ్మల్ని శత్రువుల ఫిరంగులకు బలి ఇచ్చేందుకే పంపారంటూ ఆ సమయంలో రష్యన్ సైనికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మేం చావడానికే ఇక్కడకు పంపారు. లవ్యూ అమ్మా’ అంటూ ఓ సైనికుడు తన తల్లితో మాట్లాడుతూ ఫోన్‌లో కన్నీటిపర్యంతమయ్యాడు. మరొక సైనికుడు మాట్లాడుతూ.. ‘మేం శిక్షణ కోసం వచ్చాం.. కానీ మాకు అబద్ధం చెప్పి, ఇక్కడకు తీసుకువచ్చారు. మమ్మల్ని యుద్ధంలో ముందు నిల్చొబెట్టారు.. మేం ఎవరూ ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. మా యూనిట్‌లో వారంతా ఇంటికి వెళ్లాలనుకుంటున్నారు.. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. యుద్ధం ఇష్టంలేక పలువురు తమ వాహనాలను తగలుబెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, బందీలుగా చిక్కిన రష్యన్ సైనికుల్ని వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ వచ్చి మీ బిడ్డలను తీసుకెళ్లొచ్చని బందీల తల్లులకు చెప్పింది. వారు వస్తే, అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే బందీల గురించి వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు రక్షణ శాఖ టెలిఫోన్ నంబర్లు, ఇ- మెయిల్ అడ్రెస్‌ను ప్రచురించింది. ‘కాలినిన్‌గ్రేడ్ లేదా మింస్క్‌కు వెళ్లండి.. అక్కడి నుంచి బస్సులో లేదా టాక్సీలో పొలెండ్ సరిహద్దుకు చేరుకుంటారు.. పోలాండ్ భూభాగం ద్వారా మీరు ఉక్రెయిన్‌లోకి చేరుకుంటారు.. కీవ్ అధికారులను కలుసుకుంటారు.. మేము తోడుగా ఉంటాం.. మిమ్మల్ని కీవ్‌కు తీసుకెళ్తాం.. అక్కడ మీ కుమారులను మీకు అప్పగిస్తాం.. మాది పుతిన్‌లా ఫాసిస్టు ఆలోచనా ధోరణి కాదు.. మేం ఉక్రెయిన్ వాసులం.. మేం తల్లులు, వారి బిడ్డలపై యుద్ధం చేయం’ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. డజన్ల కొద్దీ రష్యా సైనికులు పట్టుబడ్డారని, 6 వేల మందికిపైగా చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కీవ్, ఖార్కివ్‌లలో భీకర యుద్ధం కొనసాగుతున్నప్పటికీ నల్ల సముద్రం సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌లోని రేవు నగరం ఖెర్సోన్‌ను రష్యా సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. రష్యా క్షిపణి, వైమానిక దాడులను ఉక్రెయిన్ సైన్యం దీటుగానే ఎదుర్కొంటోంది. గురువారం రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇప్పటి వరకూ రష్యా దాడుల్లో 2,200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రకటించింది.
By March 04, 2022 at 08:59AM
No comments