Breaking News

30 మీటర్ల దూరంలో కాదు.. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం: పుతిన్‌కు జెలెన్‌స్కీ పిలుపు


ఉక్రెయిన్‌, రష్యా మధ్య రెండో విడత శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఓవైపు, రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు బెలారస్‌లో చర్చలు కొనసాగిస్తున్న సమయంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియా కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. 30 మీటర్ల దూరంలో కాకుండా నాతో కలిసి కూర్చొండి అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై దాడికి ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్‌, పుతిన్‌ మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొడవాటి టేబుల్‌పై ఇరువురూ దూరదూరంగా కూర్చొని చర్చలు జరిపారు. ఆ సన్నివేశాన్ని తాజాగా జెలెన్‌స్కీ గుర్తుచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమకు రక్షణ సాయం పెంచాలని పశ్చిమ దేశాలను జెలెన్‌స్కీ అభ్యర్థించారు. లేకుంటే ఐరోపాపై కూడా రష్యా దాడులు చేస్తుందని హెచ్చరించారు. ‘‘మీకు ఆకాశంలో రష్యా వైమానిక దాడులను ఆపే శక్తి లేకుంటే మాకు విమానాలు ఇవ్వండి.. ఈ యుద్ధం మాతోనే ముగిసిపోదు.. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియాకు కూడా విస్తరిస్తుంది. నన్ను నమ్మండి’’ అని జెలెన్‌స్కీ ప్రాధేయపడ్డారు. ‘‘మేము రష్యాపై దాడి చేయడం లేదు... అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కుంటున్నారు.. వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని యోచిస్తోందని కొద్ది వారాల కిందట అమెరికా చేసిన ఆరోపణలపై ఉక్రేనియన్లను శాంతింపజేయడానికి ప్రయత్నించిన జెలెన్‌స్కీ.. ‘‘ఆధునిక ప్రపంచంలో మనిషి మృగంలా ప్రవర్తిస్తాడని ఎవరూ అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఆరోపణలను నిజం చేస్తూ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్ ఆదేశాలు జారీచేయడంతో రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. విస్తృతమైన ఆధారాలు ఉన్నప్పటికీ పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా చెబుతోంది. అయితే, చెర్న్‌హివ్ నగరంలోని స్కూల్‌పైపై రష్యా దాడికి పాల్పడిందని, ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా దండయాత్రలో ఇప్పటి వరకూ 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.


By March 04, 2022 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kraine-president-volodymyr-zelensky-calls-for-direct-talks-with-putin/articleshow/89982213.cms

No comments