Breaking News

డ్రైవర్‌తో ప్రేమ.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న మంత్రి కుమార్తె!


తమిళనాడు దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు కుమార్తె ప్రేమ వివాహం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమించినవాడి కోసం పెద్దలను ఎదురించిన ఆమె.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. అనంతరం ఈ జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. మంత్రి శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్‌ జయకళ్యాణి.. తాను ప్రేమించిన సతీశ్ అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్‌లోని హలస్వామి మఠంలో సోమవారం ఈ వివాహం జరిగినట్టు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నట్టు డాక్టర్ జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తండ్రి నుంచి తనకు, తన భర్తకు ప్రాణ హాని ఉందని బెంగళూరు సిటీ కమిషనర్‌ కమల పంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు మంత్రి శేఖర్‌ ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్‌ వ్యవహారం మీడియాకు ఎక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడు మొత్తం గాలించగా.. పక్క రాష్ట్రంలో ఈ జంట ప్రత్యక్షం కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని సతీష్ ముందుకు వచ్చాడని.. అయితే తమిళనాడు పోలీసులు సతీష్‌ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారని జయకళ్యాణి ఆరోపించింది. ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది. మంత్రి శేఖర్ కారు డ్రైవర్ అయిన సతీష్‌‌ను డాక్టర్ జయకళ్యాణి ఇష్టపడింది. ఆరేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని సతీశ్ కొద్ది నెలల కిందట మంత్రి శేఖర్‌ను అడిగితే ఆయన తిరస్కరించారు. కారు డ్రైవర్‌ అందులోనూ దళితుడు కావడంతో ఆయన ఒప్పుకోలేదు. కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి తన కుమార్తెను ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకుంటానని అడగడటంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో సతీష్‌ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. దీనికి సంబంధించి గతంలో సతీష్‌ రిలీజ్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని జయకళ్యాణి తెలిపారు. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న శేఖర్‌బాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు.


By March 09, 2022 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-endowment-minister-pk-sekar-babu-daughter-elopes-with-driver-and-marry/articleshow/90091982.cms

No comments