సాహో అధ్యక్షా.. గాయపడిన సైనికులను పరామర్శించి స్థైర్యం నింపిన జెలెన్‌స్కీ
యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకూ కీవ్ సహా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలలపై బాంబు దాడులతో విరుచుకుపడ్డ రష్యన్ బలగాలు.. తాజాగా, నాటో సభ్య దేశాల సరిహద్దుల్లోనూ దాడులకు తెగబడటం చర్చనీయాంశమవుతోంది. పోలెండ్ సరిహద్దులకు సమీపంలోని లీవ్ సైనిక స్థావరం.. స్లొవేకియా, హంగేరీ బార్డర్లలోని ఇవానో ఫ్రాంకివిస్క్ ఎయిర్‌పోర్టుపై రష్యా సేనలు దాడులకు దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు దగ్గరగా వచ్చిన రష్యన్ సైనిక బలగాలు.. ఆ సిటీని ట్యాంకులతో అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. అటు, రష్యా ప్రయత్నాలకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. రాజధాని కీవ్ నగరాన్ని కైవసం చేసుకోలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో చివరి పౌరుడిలో ప్రాణం ఉన్నంత వరకూ దేశం కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని, కీవ్‌ను పూర్తిగా నేల మట్టం చేసి, అందరి ప్రాణాలు తీసిన తర్వాతే నగరం రష్యాకు దక్కుతుందని అన్నారు. కాకపోతే ఇక్కడ మిగిలేది దురాక్రమణకు వచ్చే రష్యన్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, యుద్ధంలో గాయపడి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం పరామర్శించారు. కీవ్‌లోని సైనిక ఆస్పత్రిని సందర్శించిన జెలెన్‌స్కీ.. వారిలో స్థైర్యాన్ని నింపారు. యుద్ధంలో నేలకొరిగిన సైనికులను ఉక్రెయిన్ హీరోలుగా ఇప్పటికే జెలెన్‌స్కీ ప్రకటించారు. ఈ గౌరవం దక్కినవారిలో సీనియర్ లెఫ్టినెంట్ హట్సుల్ వోలోడిమిర్ ఒలెస్‌క్సాండ్రోవిచ్ ఒకరని ఇండిపెడెంట్ పత్రిక పేర్కొంది. ఆయన 25 యూనిట్ల రష్యన్ సైనిక సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సుమారు 300 మంది శత్రు సైనికులను చంపినందుకు గౌరవార్థం ఉక్రెయిన్ హీరోగా గుర్తింపు దక్కింది. అటు, జెలెన్‌స్కీ సైనిక ఆస్పత్రిని సందర్శించి, అక్కడ సైనికులతో దిగిన సెల్ఫీలను ట్విట్టర్‌లో ఉక్రెయిన్ రక్షణ శాఖ షేర్ చేసింది. ‘‘వీరులారా త్వరగా కోలుకోండి.. మీ ప్రకటనే మన ఉమ్మడి విజయానికి అత్యుత్తమ బహుమతి అని నేను నమ్ముతున్నాను’’ అని గాయపడిన సైనికులతో జెలెన్‌స్కీ చెప్పినట్టు పేర్కొంది. అయితే, ఈ ఆస్పత్రి ఏ ప్రాంతంలో ఉందనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేయలేదు. ఇక, జెలెన్‌స్కీ సైనిక ఆస్పత్రిని సందర్శించిన వీడియోలను పలు అంతర్జాతీయ మీడియాలు ప్రచురించాయి. సైనికుల్లో మనో స్థైర్యాన్ని నింపుతున్న జెలెన్‌స్కీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమర్ధవంతమైన నాయకుడి లక్షణం అని కీర్తిస్తున్నారు. ఇటువంటి నేతనే మేము అధ్యక్షుడిగా కోరుకుంటున్నాం అని అమెరికా మాజీ సైనికాధికారి ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ రష్యాతో జరిగిన యుద్ధంలో కనీసం 1,300 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు జెలెన్‌స్కీ తెలిపారు.
By March 14, 2022 at 12:22PM
No comments