ఇకపై గమ్యం దిశగా ప్రయాణం.. నాగబాబు పోస్ట్ వైరల్! ఆయన అడుగులు ఎటువైపు..?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెగా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఇష్యూపై స్పందించే మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా ఓ పోస్ట్ పెట్టి జనాల్లో అనుమానాలు రేకెత్తించారు. మెగా కుటుంబంపై ఎవ్వరు కామెంట్స్ చేసినా చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యే ఏదో కొత్త అడుగు వేయబోతున్నట్లు ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. 'ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది' అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన మెగా బ్రదర్ అసలు విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు క్యారెక్టర్ ఆరిస్టుగా సినిమాల్లో నటిస్తూనే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు నాగబాబు. సినిమాలు, రాజకీయాల పరంగా తన వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుడే ఆయన తాజాగా పెట్టిన ఈ పోస్ట్ పలు అనుమానాలకు తావిచ్చింది. నాగబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సినిమాలు లేదా రాజకీయాలు ఏదో ఒక దానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? ఇక ఫుల్ టైమ్ ఆయన దారెటు? అనే డౌట్స్‌తో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. నాగబాబు పోస్ట్ ఉన్నది ఉన్నట్లుగా చూస్తే.. ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అని పేర్కొన్నారు నాగబాబు. జబర్దస్త్ జడ్జ్‌గా సుదీర్ఘ కాలం నవ్వించిన నాగబాబు ఆ తర్వాత పలు బుల్లితెర షోస్ కూడా చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో తన మార్క్ చూపించారు. అయితే గత కొంతకాలంగా కాస్త సైలెంట్ అయిన నాగబాబు ఉన్నట్టుండి ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఇక మెగా బ్రదర్ అడుగులు ఎటువైపు? అనే కోణంలో అంతా దృష్టి పెట్టారు.
By March 13, 2022 at 10:18AM
No comments