Breaking News

కెనడాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం


కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని.. ఓ భారీ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఒంటారియో జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. విద్యార్థుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. టొరంటోలోని భారత రాయబార కార్యాలయం బాధితుల స్నేహితులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తోందని చెప్పారు. ‘‘కెనడాలో హృదయ విదారక విషాదకర ఘటన.. శనివారం టొరంటో సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు.. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది... బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం..టొరంటోలోని భారత రాయబార కార్యాలయం సిబ్బంది బాధితుల స్నేహితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు’’ అని అజయ్ బిసారియా ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సైతం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ‘‘కెనడాలో మరణించిన ఐదుగురు భారతీయ విద్యార్థుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.. టొరంటోలోని భారత రాయబార కార్యాలయం అవసరమైన మద్దతు, అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తుంది’’ అని జయశంకర్ పేర్కొన్నారు. క్వింటే వెస్ ఒంటారియో ప్రావిన్సుల పోలీస్ (ఓపీపీ) ప్రకారం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కర్నాపాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు. వీరంతా గ్రేటర్ టొరంటో, మాంటోరియల్ ప్రాంతంలో చదువుతున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


By March 14, 2022 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-indian-students-killed-in-road-accident-in-ontario-highway-of-canada/articleshow/90194655.cms

No comments