Breaking News

యూపీలో ఫలించిన యోగి వ్యూహం.. ‘80%’ ఎఫెక్ట్ ‌తో బీజేపీ విజయానికి బాటలు..!


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఐదురాష్ట్రాల ఎన్నికలను పరిగణించారు. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి రావడం కోసం సర్వ శక్తులు ఒడ్డింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 246 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే.. సమాజ్‌వాదీ పార్టీ పుంజుకున్నప్పటికీ.. 120 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌ లాంటి పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మరోసారి ఆయన యూపీ పగ్గాలు చేపట్టడం లాంఛనమే. యూపీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహించింది. సీఎం యోగి ఆదిత్యనాధ్‌తోపాటు.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు ప్రచారం నిర్వహించారు. యోగి మరింత దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలను ఆయన 80 వర్సెస్ 20గా అభివర్ణించారు. దీంతో ఆయన హిందువులు వర్సెస్ ముస్లింలు అనే అర్థం వచ్చేలా 80 వర్సెస్ 20 అనే ప్రచార నినాదాన్ని అందుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ యోగి మాత్రం తెలివిగా.. బీజేపీకి 80 శాతం ఓట్లు పడతాయని.. ప్రతిపక్షాలకు 20 శాతం ఓట్లే పడతాయని వివరణ ఇచ్చారు. భారీ మెజార్టీతో తాము తిరిగి అధికారంలోకి రాబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చివరి దశ ఎన్నికల ప్రచారంలోనూ యోగి 80 వర్సెస్ 20 అంటూ ప్రచారం నిర్వహించారు. యూపీ ఎన్నికల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ తన సరికొత్త నినాదం ద్వారా హిందువుల ఓట్లు కులాల వారీగా చీలిపోకుండా.. గంపగుత్తగా బీజేపీకి పడేలా చేయడంలో యోగి సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 36 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తోన్న పార్టీగా బీజేపీ రికార్డ్ క్రియేట్ చేసింది.


By March 10, 2022 at 11:17AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/uttar-pradesh/news/yogi-adityanth-strategies-helps-bjp-to-lead-in-uttar-pradesh-assembly-elections-2022/articleshow/90118392.cms

No comments