Breaking News

పంజాబ్‌లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఛన్నీ.. సిద్ధూకు లైవ్‌లోనే రాహుల్ చురకలు


ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై గత కొద్ది రోజులుగా పంజాబ్ కాంగ్రెస్‌లో సాగుతున్న ఊహాగానాలకు ఆదివారం తెరపడింది. ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీయే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని అగ్రనేత ప్రకటించారు. లుధియానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వర్చువల్‌గా పాల్గొన్న రాహుల్.. ఈ ప్రకటన చేశారు. సాధా రణంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించదు. అయితే, పంజాబ్‌ ఎన్నికల విషయంలో ఈసారి ఆ సంప్రదాయాన్ని ఆ పార్టీ పక్కన పెట్టింది. పంజాబ్‌లో వివిధ రాజకీయ పరిణామాలు, సీఎం అభ్యర్థిత్వం కోసం ఛన్నీ, పీసీసీఅధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్దూ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తే 60 మంది అభ్యర్థులను గెలిపించగలరని, బలహీనమైన వ్యక్తిని సీఎం కావాలని అధిష్ఠానం కోరుకుంటోందని గాంధీలపై సిద్దూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే, సిద్ధూ విమర్శలను, బెదిరింపు ధోరణికి ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం భయపడలేదు. పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని నిర్ణయించడానికి ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. ఈ పరిణామాల తర్వాత ఛన్నీని సీఎం అభ్యర్థిగా నిర్ణయించింది. ఛన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు 10-15 రోజుల్లో పుట్టరని, టెలివిజన్ చర్చల్లో పాల్గొనడం ద్వారా తయారుకాలేరని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఛన్నీని నేను నిర్ణయించలేదు.. ఈ అంశంపై పంజాబ్ ప్రజలు, యువత, పార్టీ సభ్యులను నేను అడిగాను.. నాకు ఓ అభిప్రాయం ఉండొచ్చు కానీ, దానికంటే మీ అభిప్రాయమే చాలా ముఖ్యం.. పేదలను అర్ధం చేసుకునే వ్యక్తే సీఎం అభ్యర్థిగా ఉండాలని పంజాబీలు తెలియజేశారు’’ అని రాహుల్ అన్నారు. ‘‘పార్టీకి నాయకులను అభివృద్ధి చేసే వ్యవస్థ ఉందని రాహుల్ నొక్కి చెబుతూ... పరోక్షంగా సిద్ధూకు కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను.. గత ఆరు, ఏడేళ్లుగా నేను నేర్చుకున్నంత నేర్చుకోలేదు.. రాజకీయాలు సులువైన పని అనుకోవడం తప్పు.. చాలా మంది వ్యాఖ్యాతలు ఉన్నారు కానీ నాయకుడిని తయారు చేయడం అంత సులభం కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఛన్నీ పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ.. పేదరికం అంటే ఏంటో తెలుసు.. ప్రజల వద్దకు వెళ్లి వారిని కలుసుకున్నప్పుడు ఆయనలో ఎప్పుడైనా అహంకారం కనబడిందా...ఛన్నీ పేద ప్రజల గొంతుక’’ అని స్పష్టం చేశారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది.


By February 07, 2022 at 07:30AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/punjab/news/rahul-gandhi-announced-charanjit-singh-channi-as-the-congress-chief-ministerial-candidate-in-punjab/articleshow/89394438.cms

No comments