Breaking News

అన్ని కరోనా వేరియంట్లకే ఒకే టీకా అభివృద్ధి: భారత్ శాస్త్రవేత్తలు మరో ఘనత


కరోనా వైరస్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు కొత్త వేరియంట్‌లపై అంతగా ప్రభావం చూపడంలేదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసే సార్వత్రిక టీకాను అభివృద్ధి చేసినట్లు భారత శాస్త్రవేత్తలు ప్రకటించారు. పశ్చిమ్ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్) శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ అభివృద్ధి చేసిన పెప్టైడ్‌ వ్యాక్సిన్‌ ‘అభిఎస్‌సీవో వ్యాక్‌’ అని పేరును సూచించారు. వ్యాక్సిన్ తయారీకి ఇమ్యునోఇన్ఫర్మేటిక్‌ విధానాలను అనుసరించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ టీకా కోవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తో పాటు ఆ కుటుంబానికి చెందిన hCoV-229E, hCoV-HKU1, hCoV-OC43, SARS-CoV, MERS-CoV ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. కరోనా తరగతిలోని అన్ని వైరస్‌లను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకునే టీకాల్లో ఇదే మొదటిదని, ప్రపంచంలో ఇంకెక్కడా లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘‘ఆరు భిన్న వైరస్‌లలో స్పైక్‌ ప్రొటీన్‌లో కొన్ని భాగాలు చాలా తక్కువగా ఉత్పరివర్తనాలకు లోనవుతున్నట్లు తొలుత గుర్తించాం.. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక స్పందనను కలిగించొచ్చు.. స్పైక్‌ ప్రొటీన్‌లోని ఈ భాగాలకు టీఎల్‌ఆర్‌4 అనే ప్రొటీన్‌తో బలమైన బంధం ఏర్పరిచే సామర్థ్యం ఉంది.. కరోనా వైరస్‌ను గుర్తించి, రోగ నిరోధక స్పందనను కలిగించడంలో ఈ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తోంది’’ అని తెలిపారు. ‘ఈ పరిశోధన ఫలితాలను ప్రముఖ సైన్స్ జర్నల్ మాలిక్యులర్ లిక్విడ్స్‌లో ప్రచురణ కోసం ఆమోదం లభించింది. తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యంత స్థిరంగా, యాంటీజెనిక్, ఇమ్యునోజెనిక్‌గా ఉన్నట్లు కనుగొన్నాం.. వర్చువల్‌గా ఈ టీకాను ఇచ్చినవారికి వైరస్‌ల నుంచి రక్షించగల అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడయ్యింది’కాజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభిజ్ఞాన్ ఛౌదురి, సుప్రభాత్ ముఖర్జీ, ఐఐఎస్ఈఆర్- భువనేశ్వర్‌కు చెందిన పార్థ సారథి సేన్ గుప్తా, సరోజ్ కుమార్ పండా, మలై కుమార్ రాణా అన్నారు.


By February 07, 2022 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-scientists-says-to-have-designed-vaccine-against-all-variants-of-coronavirus/articleshow/89394913.cms

No comments