Breaking News

మిరాకిల్: కరెంట్ షాక్‌తో పోయిన రెండు చేతులు.. సర్జరీతో కొత్తవి అతికించిన వైద్యులు


వైద్య శాస్త్రంలో మరో అద్బుతం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తికి.. విజయవంతంగా వైద్యులు అవయవమార్పిడి చేశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన వ్యక్తి చేతులను కేరళ వైద్యులు అతికించి అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బసవణ్ణగౌడ (34) 2011 జులైలో తన రెండు చేతులూ కోల్పోయాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగలడటం వల్ల చేతులు కాలిపోయాయి. దీంతో అతడిని చికిత్స కోసం వెంటనే బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. చేతులు పూర్తిగా కాలిపోవడంతో ప్రాణానికి ప్రమాదం లేకుండా వాటిని మోచేతి వరకు తొలగించారు. పదేళ్ల తర్వాత శస్త్రచికిత్సతో బసవణ్ణగౌడకు వేరొకరి చేతులు అతికించి వైద్యులు అద్బుతం చేశారు. కొచ్చికి చెందిన వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్టు బుధవారం ప్రకటించారు. రెండు చేతులు కోల్పోయిన బసవణ్ణ.. 2016లో అమృత ఆస్పత్రి హ్యాండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో తీవ్ర అనారోగ్యంతో ఇదే ఆస్పత్రిలో చేరిన కొట్టాయం యువకుడు నెవిస్ సాజన్ మాథ్యూ (25) బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ఉంటున్న మాథ్యూ సెలవుల కోసం సొంతూరుకు వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. సెప్టెంబరు 24న ఆ యువకుడు మరణించగా, అవయదానానికి అతడి తల్లిదండ్రులు సాజన్ మాథ్యూ, షెరిన్‌లు అంగీకరించారు. దీంతో అతడి రెండు చేతులూ తొలగించిన వైద్యులు.. అవయమార్పిడి కోసం వినియోగించాలని నిర్ణయించారు. యువకుడి బ్లడ్‌ గ్రూప్‌ బసవణ్ణగౌడకు సరిపోవడంతో మర్నాడే సెప్టెంబరు 25న చేతుల మార్పిడి శస్త్రచికిత్స చేపట్టినట్లు ఆస్పత్రి సెంటర్‌ ఫర్‌ ప్లాస్టిక్‌, రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ చీఫ్ డాక్టర్ మోహిత్‌ శర్మ వెల్లడించారు. డాక్టర్ సుబ్రమణ్యం అయ్యర్ నేతృత్వంలోని వైద్యుల బృందం 14 గంటలు వ్యవధిలో న్యూ ఆక్సిజన్‌ క్యారియర్‌ హెమో-2లైఫ్‌ (ఫ్రాన్స్‌ టెక్నాలజీ) విధానంతో ఈ చికిత్స చేసిందన్నారు. ‘ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స.. బాధితుడికి సహజ చేతుల్లోని కండరాలు ఒక్క భాగం మాత్రమే మిగిలాయి.. కండరాలు, ఎముకలను స్వీకర్త చేతులకు సరిగ్గా అమర్చడం సవాల్‌తో కూడుకున్నది’ అని వైద్యులు తెలిపారు. అంతేకాదు, రక్తనాళాలనూ అతికించి, వెంటనే కొత్త చేతులకు రక్తం సరఫరాను పునరుద్ధరించామని, దాంతో అవి పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటున్న బసవణ్ణ ఈ కొత్త చేతులతో స్వయంగా పని చేసుకోగలరని వైద్యులు ప్రకటించారు. డాక్టర్ అయ్యర్ మాట్లాడుతూ..‘‘రోగి శస్త్రచికిత్స అత్యంత విజయవంతమైంది.. కొన్ని వారాల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం.. కండరాల సాగతీతతో సహా ఫిజియోథెరపీ కొనసాగుతోంది.. నరాల పెరుగుదల, కొత్త చేతుల పనితీరు నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దీపనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.. ఆ తర్వాత, రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఆక్యుపేషనల్ థెరపీ, కండరాలను బలపరిచే వ్యాయామాలను చేయాలి’ అని అతను చెప్పాడు. ‘‘చేతుల పనితీరు నిర్ధారించడానికి కనీసం ఒక ఏడాది పాటు వీటిని కొనసాగించారు.. కొన్ని నెలల తర్వాత మాత్రమే తన వేళ్లను చురుకుగా కదిలించగలడు.. అవయవ మార్పిడి చేతుల వల్ల ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రోగి జీవితాంతం ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.


By February 10, 2022 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-man-who-lost-both-hands-in-electrical-accident-gets-double-hand-transplant/articleshow/89467020.cms

No comments