Breaking News

కశ్మీర్ మా అంతర్గత వ్యవహారం.. తలదూర్చొద్దు: పాక్, చైనాలకు భారత్ వార్నింగ్


జమ్ము కశ్మీర్‌ అంశంలో పదే పదే అవాకులు చెవాకులు పేలుతూ అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చేయని ప్రయత్నం లేదు. దాయాది ప్రయత్నాలకు పొరుగు దేశం తాన అంటే తనందాన అంటూ ఎప్పటికప్పుడు విషం గక్కుతోంది. వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు, ఆ దేశానికి వంతపాడుతున్న చైనాకు భారత్‌ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కశ్మీర్‌కు సంబంధించి చైనా-పాకిస్థాన్‌ సంయుక్త ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన భారత్.. మా అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. గతవారం చైనాలో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫిబ్రవరి 6న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌()సహా జమ్మూకశ్మీర్‌ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. అనంతరం జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘ఐక్యరాజ్య సమితి సూచనలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా కశ్మీర్‌ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి’’అని సూచించారు. పరిస్థితిని తీవ్రతరం చేసే ఏకపక్ష చర్యలను చైనా ఎప్పటికీ అంగీకరించదని వ్యాఖ్యానించారు. ‘‘శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియానే మా ఉమ్మడి అజెండా’’ అని చైనా, పాక్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి బుధవారం మాట్లాడుతూ.. ఇరు దేశాలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘చైనా-పాకిస్థాన్‌ సంయుక్త ప్రకటనలో ఇచ్చిన సూచనలను తిరస్కరిస్తున్నాం.. భారత్‌ స్థాయి ఏంటో వారికి బాగా తెలుసు. జమ్మూ కశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత భూభాగాలే.. భారత అంతర్గత వ్యవహారాల్లో ఆ రెండు దేశాలు జోక్యం చేసుకోవని భావిస్తున్నాం.. పాక్ ఆక్రమించిన భారత భూభాగంలో చైనా-పాకిస్థాన్‌ కారిడార్‌ ప్రాజెక్టులపై మా వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉన్నాం.. ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చడానికి పాకిస్థాన్‌తోపాటు ఏ దేశం ప్రయత్నించినా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం.. అందుకే, అటువంటి కార్యకలాపాలను నిలిపివేయాలి’’ అని అరిందమ్‌ బాగ్చి తెల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను 2019 ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ తరుచూ లేవనెత్తుతోంది. అయితే, భారత్ మాత్రం ఇది తమ అంతర్గత వ్యవహారమని గట్టిగా బదులిస్తోంది.


By February 10, 2022 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-rejects-references-to-kashmir-cpec-in-china-pakistan-joint-statement/articleshow/89467886.cms

No comments