Breaking News

వీలునామా అలారాస్తే భర్త ఆస్తిపై భార్యకు సంపూర్ణ హక్కులండవు: సుప్రీంకోర్టు


భర్త స్వార్జితమైన ఆస్తిపై భార్యకు గల హక్కు విషయమై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వ్యక్తి తన వీలునామాలో పరిమితులు విధించిన పక్షంలో ఆ ఆస్తిపై భార్యకు సంపూర్ణ హక్కులండవని హరియాణకు చెందిన మహిళ కేసులో స్పష్టం చేసింది. భార్య బాగోగుల కోసం ఏర్పాట్లు చేస్తే అనుభవించడానికి మాత్రమే అర్హత ఉంటుందని పేర్కొంది. ‘ హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని జీవితాంతం అనుభవించడానికే మాత్రమే అర్హురాలని వీలునామా రాసిన పక్షంలో సదరు ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవు’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన తులసీరామ్‌ అనే వ్యక్తి తన మొదటి భార్య చనిపోవడంతో రామ్‌దేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య రామ్‌దేవి, కుమారుడి పేరున 1968 ఏప్రిల్‌లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవితాంతం అనుభవిస్తూ, దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం మాత్రం యావత్‌ ఆస్తి సంపూర్ణంగా తన కుమారుడికే చెందుతుందని వీలునామాలో స్పష్టం చేశాడు. తులసీరామ్‌ నవంబరు 1969లో మృతిచెందాడు. అయితే, ఈ ఆస్తిని రామ్‌దేవి నుంచి కొందరు వ్యక్తులు కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. చివరికి ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టుకు చేరింది. ‘‘రామ్‌దేవి నుంచి ఈ ఆస్తిని కొనుగోలుచేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్‌ డీడ్‌లను కొనసాగించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘మా దృష్టిలో హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 14 (2) లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది.. ఆస్తి వివాదానికి సంబంధించిన వివిధ కేసులలో ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించింది.. ఆస్తి యజమాని వీలునామాలో ఎటువంటి పరిమితులు లేకుంటే సెక్షన్ 14(1) కింద చట్టం ప్రకారం సంపూర్ణ హక్కులు దఖలు పడతాయి.. దీనికి సెక్షన్ 14 (2) వర్తిస్తుంది.. దీని ప్రకారం ఆమెకు జీవితాంతం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది.. మరణానంతరం కుమారుడికే చెందుతుంది’’ అని వ్యాఖ్యానించింది.


By February 02, 2022 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/property-ownership-by-wife-if-maintenance-taken-care-of-says-supreme-court/articleshow/89287415.cms

No comments