Breaking News

ఒమిక్రాన్‌ను మించిన వేగంతో సబ్-వేరియంట్ వ్యాప్తి: అమెరికా అధ్యయనం


కొత్తరకం వేరియంట్ మిగతావాటి కంటే ఆరు రెట్ల వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. అయితే, దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన అసలు దానికంటే ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని సూచించే కొత్త అధ్యయనాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఈ తేలికపాటి వేరియంట్ సోకడం ద్వారా వచ్చే రోగనిరోధకత భవిష్యత్తులో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి ఎక్కువ రక్షణను అందించకపోవచ్చని అంటున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ మహమ్మారి ముగింపునకు తీసుకెళుతుందనే ఆశలపై పరిశోధనలు సందేహాన్ని కలిగిస్తున్నాయి. మహమ్మారి నియంత్రణకు విధించిన ఆంక్షలతో ప్రజలు విసిగిపోవడం, వ్యాక్సిన్‌లు మరింత అందుబాటులోకి రావడం, మరణాలు సాపేక్షంగా తక్కువగా ఉండటంతో కోవిడ్-19ని ఇన్‌ఫ్లూయెంజా వంటి సాధారణ జలుబుగా పరిగణించాలనే డిమాండ్లను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల నివేదిక ప్రకారం.. ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ సమయంలో తటస్థంగా ఉన్న యాంటీబాడీల ఉత్పత్తి అనారోగ్య తీవ్రతకు సంబంధించిందిగా కనిపిస్తోంది. ఈ అధ్యయనాన్ని సమీక్షించడానికి ముందు ఆన్‌లైన్‌లో ప్రచురించారు. టీకాలు తీసుకున్న చాలా మంది వ్యక్తులు ఓమిక్రాన్ బారినపడి కోలుకున్నప్పటికీ భవిష్యత్తులో ఉద్భవించే వేరియంట్లు హాని కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి మూడింట ఒక వంతు బూస్టర్ డోస్‌ ద్వారా రక్షణ పొందినట్టు అధ్యయనం గుర్తించింది. ‘‘ఒమిక్రాన్ ద్వారా లభించిన రోగనిరోధకశక్తి భవిష్యత్తులో ఉద్భవించే కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారించడానికి సరిపోదని మా ఫలితాలు సూచిస్తున్నాయి’’ అని పరిశోధకులు తెలిపారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో బూస్టర్‌ డోస్‌ల ప్రాముఖ్యతను కూడా నొక్కిచెప్పారు. కొత్త వేరియంట్‌ల కారణంగా ఇన్‌ఫెక్షన్లు లేదా భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల నుంచి బూస్టర్ డోస్‌లు రక్షణ కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు. మరో అధ్యయనంలో ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అసలైనదాని కంటే ఎక్కువగా వ్యాప్తి చేయగలదని వెల్లడయ్యింది. BA.2 సబ్‌ వేరియంట్‌ సోకిన 39 శాతం మందిలో అసలు వేరియంట్ బారినపడ్డ 29% మందితో పోలిస్తే వారి ఇళ్లలోని ఇతరులకు సోకే అవకాశం ఉందని తేలింది. సబ్-వేరియంట్ ఉద్ధృతంగా ఉన్న డెన్మార్క్‌లో డిసెంబర్, జనవరి మధ్య 8,541 గృహాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు. టీకాలు తీసుకోనివారిలో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని నొక్కి చెప్పింది. సబ్‌- వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు యూకే గత వారం విడుదల చేసిన ఆరోగ్య నివేదికలో పేర్కొంది. బూస్టర్ డోస్‌లు ప్రభావవంతమైన కవచంగా ఉన్నాయని కూడా తెలిపింది. BA.1 ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ.. భారత్, దక్షిణాఫ్రికా, బ్రిటన్, డెన్మార్క్‌తో సహా కొన్ని దేశాల్లో BA.2 పెరుగుతున్నట్లు ఇటీవలి పోకడలు సూచిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో తెలిపింది.


By February 02, 2022 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/omicron-sub-variant-spreading-even-faster-than-original-says-us-study/articleshow/89287926.cms

No comments