ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి.. త్రిశూల వ్యూహంతో సిద్ధమైన రష్యా
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం ఓవైపు ప్రయత్నిస్తుంటే.. మాత్రం ఆక్రమణకే మొగ్గుచూపుతున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా, వెలుగుచూసిన ఉపగ్రహా చిత్రాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా వ్యూహరచన చేసినట్టు వెల్లడిస్తున్నాయి. మూడు వైపుల నుంచి సైన్యాలను మోహరించింది. క్రిమియా, బెలారస్, తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక కవాతులు, యుద్ధ ట్యాంకులు, శతఘ్ని, క్షిపణి దళాల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని దొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ దళాలు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు ఈ ప్రాంతంలో 2014 నుంచి పోరు సాగుతోంది. తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరువగా తన దళాలను రష్యా పెంచుకోవడంతో ఈ ప్రాంతం గుండానే సైనిక చర్యను ఆరంభించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాలోని అతిపెద్ద భారీ సైనిక స్థావరమైన యెల్న్యాలో గతేడాది చివరి నాటికి దాదాపు 700 ట్యాంకులు, పదాతిదళ పోరాట శకటాలు, శతఘ్నులు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు ఉండేవి. అయితే, ఇటీవల ఆ స్థావరం చాలావరకూ ఖాళీగా కనిపిస్తోంది. అక్కడి ఆయుధాలు, సామాగ్రిని రైలు, రోడ్డు మార్గంలో ఉక్రెయిన్‌కు సమీపంలోని బ్రయాన్స్క్ ప్రాంతానికి తరలించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ ఈశాన్య సరిహద్దుల్లోని కర్స్క్, బెల్గోరాడ్ ఓబ్లాస్ట్స్ వద్ద కూడా సైనిక కదలికలు పెరిగాయి. సాధారణంగా మాస్కో ప్రాంతంలో ఉండే శక్తివంతమైన దళం‘ఫస్ట్ గార్డ్స్ ట్యాంక్ ఆర్మీ’ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు అనువైన మార్గంలో మోహరించింది. పొరుగున ఉన్న బెలారస్‌తో రష్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఈ దేశాన్ని కూడా రష్యా వినియోగించుకుంటోంది. బెలారస్‌లోకి ఇప్పటికే సైన్యాలు, యుద్ధ సామాగ్రిని తరలించింది. మొత్తం 30వేల మంది సైనికులు, స్పెట్స్‌నాజ్ ప్రత్యేక బలగాలు, సుఖోయ్-35 సహా పలు రకాల యుద్ధవిమానాలు, ఇస్కాందర్ క్షిపణులు, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ వంటివి మోహరించింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత బెలారస్‌లో ఇంత భారీగా రష్యా సైనిక మోహరింపులు జరగడం ఇదే మొదటిసారి. రెండు దేశాల సైన్యాలు గతవారం నుంచి యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తున్నాయి. బెలారస్‌లోని గోమెల్‌కు సమీపంలోని జ్యాబ్రోవక్కా వైమానిక క్షేత్రం వద్ద కొత్తగా రష్యా బలగాలు, సైనిక వాహనాలు, హెలికాప్టర్లు కనిపించాయి. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోమెల్ ప్రాంతంలోని రెచిత్సా వద్ద తొలిసారిగా సైనిక గుడారాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశం ఉక్రెయిన్ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణమైనా దాడి చేయొచ్చన అమెరికా నిఘావర్గాల హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తన పౌరులను ఉక్రెయిన్ వదిలి తక్షణమే వచ్చేయాలని అమెరిక సహా మిత్రదేశాలు హెచ్చరించాయి. అలాగే, కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు ఉక్రెయిన్‌కు వెళ్లే తమ విమానాలపై ఆంక్షలు విధించినట్లు డచ్ ఎయిర్‌లైన్ కేఎల్‌మ్ తెలిపింది. పోర్చుగల్‌లోని మదేరా నుంచి కీవ్‌కు వెళుతున్న విమానాన్ని స్కైఅప్ సంస్థ చివరి నిమిషంలో మాల్దోవాకు మళ్లించింది.
By February 14, 2022 at 10:11AM
No comments