Breaking News

యూపీలో రెండో దశ సహా గోవా, ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్


ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 స్థానాలు, గోవాలోని 40 స్థానాలకు ఒకే విడతలో సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రెండింటితో పాటు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 9 జిల్లాల్లోని 55 సీట్లకు ఓటింగ్ జరుగుతుండగా.. 586 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందిన 47 సీట్లలో అత్యధికంగా ఇక్కడ 15 ఉన్నాయి. సహారన్‌పూర్, బిజ్‌నోర్, మొరాదాబాద్, శంబాల్, రామ్‌పూర్, అమ్రోహ్, బుదాన్, బరేలీ, షాజహాన్‌పూర్‌ జిల్లాలు ఈ దశలో ఉన్నాయి. జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు ఆజంఖాన్ రాంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ కుమారుడు అబ్ధుల్లా ఆజం కూడా స్వార్ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ దశలో మొత్తం 4,917 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 6,860 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 54,670 మంది కానిస్టేబుళ్లు, 43,397 మంది హోంగార్డులు, 930 మంది పీఆర్డీ జవాన్లుతో పాటు 794 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగియనుంది. ఉత్తరాఖండ్ బరిలో మొత్తం 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 82,38,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీతోపాటు బీజేపీ మంత్రులు, కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్, ఆప్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది ఇక, 40 స్థానాలున్న గోవాలోనూ నేడు ఒక్క విడతలోనే పోలింగ్ పూర్తి కానుంది. గోవా ఎన్నికల బరిలో 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 11,56,564 మంది ఓటర్లు ఉండగా... 1,722 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.గోవాలో సీఎం ప్రమోద్ సావంత్, ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం చుర్చిల్ అలీమావో, మాజీ సీఎం కుమారుడు ఉత్పల్ పారికర్ లు పోటీ చేస్తున్నారు.


By February 14, 2022 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/voting-undeway-in-uttarakhand-and-goa-all-seats-and-up-55-assembly-seats/articleshow/89556497.cms

No comments