Breaking News

Shamanism ఆత్మలతో మాట్లాడేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన 17 ఏళ్ల బాలిక


‘షామనిజం’ (ఆత్మలతో మాట్లాడటం)పై ఉన్న ఆసక్తితో ఓ 17 ఏళ్ల బాలిక ఇంటిలో నుంచి వెళ్లిపోయిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగు చూసింది. అనుష్క అనే 17 ఏళ్ల బాలిక రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న తల్లిదండ్రులు ‘షామనిజం’పై ఉన్న ఆసక్తితోనే తను ఇంట్లోంచి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. కంటికి కనిపించని వాటిపై నమ్మకం పెంచుకోవడాన్ని అంటారు. దీనికి ప్రభావితమైనవారు.. పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు. అనుష్కకూ దీనిపై ఆసక్తి ఉండేదని ఆమె తల్లి తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ముందు రోజు ఆమెకు చాలా నచ్చజెప్పామని, తననెవరూ అర్థం చేసుకోరంటూ అరిచిందని తల్లి అర్చన కన్నీటిపర్యంతం అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందం ఆమె కోసం గాలిస్తోంది. మరోవైపు.. అనుష్క తండ్రి అభిషేక్‌ సోషల్ మీడియా వేదికగా కుమార్తె వివరాలు షేర్‌ చేసి, ఆరా తీస్తున్నారు. అక్టోబరు 31న ఇంటి నుంచి వెళ్లిపోతూ కేవలం రెండు జతల దుస్తులు, రూ.2,500 నగదు తీసుకెళ్లిందని తెలిపారు. షామనిజంపై ఆన్‌లైన్‌లో చదివి ఆసక్తి పెంచుకున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్ పూర్తిచేసిన అనుష్క.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే వ్యక్తులు, మనోవిజ్ఞాన వేత్తలతో ప్రభావితమైంది. షామానిజంపై అధ్యయనం గురించి వారితో మాట్లాడినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ‘నా కుమార్తె మైనర్.. ఏది మంచి.. ఏది చెడు అని తనంతట తానుగా నిర్ణయం తీసుకునే స్థితిలో లేకపోవచ్చు.. షామానిజంను అనుసరించాలని అనుకుంటున్నానని అనుష్క నాకు చెప్పింది’ అని అభిషేక్ అన్నారు. టీనేజర్ కావడంతో ఆమెలో మార్పులు సాధారణమని భావించాం.. కానీ, సెప్టెంబరులో ఆమె ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించిన తర్వాత ఏకాంతంగా గడపడం.. ప్రతి ఒక్కరికీ దూరంగా ఉంటుంది.. దీంతో నేను ఆమెను కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లాను.. క్రమంగా మాతో మాట్లాడటం మానేసింది.. ఒంటరిగా ఉంటూ దైనందిన కార్యకలాపాను పరిమితం చేసుకుంది’అని చెప్పారు. అక్టోబరు 31న అనుష్క ఇంటి నుంచి వెళ్లిపోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె కోసం గాలిస్తున్నారని వివరించారు. క్లిష్టమైన కేసుగా అభివర్ణించిన పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ‘‘సీసీటీవీ కెమెరాల ద్వారా ఆమె కదలికలను విశ్లేషించాం.. చట్టపరంగా సేకరించగలిగే ఆన్‌లైన్ కార్యకలాపాలతో పాటు ఇటీవలి కాలంలో ఆమె ఏ అంశంపై ఆసక్తి ప్రదర్శించారనేది అన్వేషిస్తున్నాం.. ఈ మధ్య కాలంలో ఆమె ఎవరినీ సంప్రదించలేదు’ అని బెంగళూరు నార్త్ డిప్యూటీ కమిషనర్ వినాయక్ పాటిల్ తెలిపారు.


By January 01, 2022 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/girl-missing-for-2-months-and-parents-suspect-shamanism-connection-in-bengaluru/articleshow/88627660.cms

No comments