Breaking News

ఇజ్రాయేల్‌లో కొత్తరకం వ్యాధి: ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదు.. డబుల్ ఇన్‌ఫెక్షన్


చైనాలో మొదలైన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజుకో రూపం మార్చుకుని దాడిచేయడంతో అల్లాడిపోతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఈ తురుణంలో ఇజ్రాయేల్లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో ఫ్లొరోనా తొలి కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇజ్రాయేల్లో ఈ తరహా కేసు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు.. ఇజ్రాయెల్ కోవిడ్ వ్యాక్సిన్ నాలుగో డోస్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందుతుండటం వల్ల టీకాల ద్వారా వచ్చిన వ్యాధినిరోధకశక్తి క్షీణించడంతో నాలుగో డోసు ప్రక్రియను ప్రారంభించామని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ తెలిపారు. తమ దేశప్రజలకు మూడో డోసు టీకా అందించి నాలుగు నెలలు దాటిందని ఆయన పేర్కొన్నారు. వృద్ధాశ్రమాల్లోని వారికి వ్యాక్సిన్ డోస్ అందజేయడానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. వృద్ధాశ్రమాల్లో కరోనా వ్యాప్తిచెంది ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. మరోవైపు, ఇజ్రాయేల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గురువారం కొత్తగా దాదాపు 5,000 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, నాలుగో డోస్ ప్రభావంపై టెల్‌ అవివ్‌ శివారులోని షెబా మెడికల్‌ సెంటర్‌లో సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ఇజ్రాయేల్ ప్రారంభించింది. పలువురికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ నాలుగో డోసును అందించింది. ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 6వేల మందికి నాలుగో డోసును అందజేయనున్నారు. వాలంటీర్ల జాబితాలో 150 మంది వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా ఆగస్టుకు ముందే బూస్టర్ డోస్ తీసుకున్నారు. అలాగే, యాంటీబాడీల సంఖ్య 700 కంటే దిగువన ఉన్నవారు, 60 ఏళ్లు పైబడినవారు, వైద్య సిబ్బంది, వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాల ప్రజలకు నాలుగో డోసును అందజేయాలని ఇజ్రాయేల్‌ ఆరోగ్యశాఖ నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


By January 01, 2022 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/israel-reports-first-case-of-florona-disease-a-double-infection-of-covid-19-and-influenza/articleshow/88628112.cms

No comments