Breaking News

Padma Shri: అలనాటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో పద్మ పురస్కారం


రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి అవార్డులు వరించాయి. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు అలనాటి విలక్షణ నటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 90 ఏళ్ల వయసులో ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం. ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన షావుకారు జానకి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలుకొని నేటితరం హీరోల తోనూ తెరపంచుకున్నారు. 1931 డిసెంబర్‌ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత రేడియో నాట‌కాల్లో, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇస్తూ సినీ గడప తొక్కారు. దర్శక నిర్మాత బి.ఎన్‌. రెడ్డి రికమండేషన్‌‌తో ఆమెకు 'షావుకారు' అనే చిత్రంలో హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇదే ఆమె తొలి సినిమా. ఈ మూవీతో మంచి పేరు రావడంతో 'షావుకారు' అనే పేరే జానకి ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పరంగా పలు సినిమాల్లో భాగమైన ఆమె తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్‌ ,శివాజీ గణేశన్‌ సరసన నటించారు. ''వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతం ఊరు, జయం మనదే, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్లు, మంచి కుటుంబం'' లాంటి సినిమాలు షావుకారు జానకికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉన్నారు. షావుకారు జానకికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


By January 26, 2022 at 07:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-sowcar-janaki-awarded-padma-shri/articleshow/89128402.cms

No comments