Breaking News

వరుసగా రెండో ఏడాది విదేశీ అతిథి లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు


ఈ ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్య జరుగుతున్నాయి. కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అతికొద్ది మందికే వేడుకలకు అనుమతిస్తున్నారు. సాధారణంగా రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ నేత విశిష్ట అతిథిగా హాజరవుతారు. కానీ, ఈ ఏడాది కూడా అతిథి హాజరు కాలేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది వరుసగా రెండోసారి.. మొత్తంగా ఐదోసారి. గతేడాది కూడా విదేశీ అతిథులు హాజరుకాలేదు. గతంలో 1952, 1953, 1966లలోనూ ఇలాగే జరిగింది. గతేడాది గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌‌ను ఆహ్వానించగా.. ఆయన రావడానికి అంగీకరించారు. కానీ, యూకేలో కరోనా విజృంభించడంతో తన భారత పర్యటనను జాన్సన్ రద్దుచేసుకున్నారు. కేవలం కొద్ది మంది నేతలు హాజరుకానుండగా.. 15 ఏళ్లలోపు చిన్నారులను పరేడ్‌కు అనుమతించలేదు. రెండు డోస్‌లు టీకా తీసుకున్న 15 ఏళ్లు, ఆపై వయసు పిల్లలకు ప్రవేశం ఉంటుంది. అలాగే, కేవలం 12 రాష్ట్రాలకు చెందిన శకటాలకే పరేడ్‌లో అనుమతి లభించింది. సాధారణంగా రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు లక్షకుపైగా జనం హాజరవుతారు. కానీ, కరోనా నేపథ్యంలో గతేడాది 25 వేల మందిని అనుమతించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గిపోయింది. కేవలం 5 నుంచి 8 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఢిల్లీలో పొగ మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఉదయం 10.30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుంది. పరేడ్ జరిగే ప్రాంతంలో మొత్తం 10 భారీ స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కళ్లూ తప్పనసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రతి ఏడాది మాదిరిగానే సాయుధ దళాలు రాజ్‌పథ్‌లో కవాతు నిర్వహిస్తాయి. రఫేల్, జాగ్వార్, మింగ్-17, అపాచీ, సుఖోయ్, డకోటా యుద్ధ విమానాలు సహా మూడో తరం రష్యన్ టి -90 యుద్ధ ట్యాంక్, టి -72 బ్రిడ్జ్-లేయర్ ట్యాంక్, బీఎమ్‌పీ -2 సాయుధ సిబ్బంది, పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్, బ్రహ్మోస్ ల్యాండ్-అటాక్ వేరియంట్‌లను ప్రదర్శిస్తారు. తొలిసారి మొత్తం 75 యుద్ద విమానాలు లేదా హెలికాప్టర్లతో ఫ్లై‌ఫాస్ట్ నిర్వహించనున్నట్టు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. అలాగే, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించనున్నారు. సుమారు 5,000 మంది అమర వీరుల కుటుంబాలకు దేశవ్యాప్తంగా నేషనల్ క్యాడెట్ కార్ప్ సభ్యులు కృతజ్ఞతా ఫలకాన్ని అందజేస్తారు. రిపబ్లిక్ డే వేడుకలను నేతాజీ జయంతి జనవరి 23 నుంచి 30 వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. విజయ్ చౌక్ వద్ద బీటింగ్ రీట్రీటింగ్ జనవరి 29న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 480 మంది కళాకారులు, డ్యాన్సర్ల వందే భారతం నృత్య ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి.


By January 26, 2022 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-to-celebrate-its-73rd-republic-day-today-with-a-shortened-programme-due-to-covid-third-wave/articleshow/89129030.cms

No comments