దేశంలో నాలుగు కోట్లకు చేరిన కోవిడ్ బాధితులు
దేశంలో కరోనా బాధితుల సంఖ్య మంగళవారం నాటికి 4 కోట్లు దాటేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో గత మూడు వారాల్లోనే 50 లక్షల కొత్త కేసులు బయటపడ్డాయి. అమెరికా తర్వాత అత్యధికంగా కోవిడ్ కేసులు భారత్‌లోనే వెలుగుచూశాయి. అమెరికాలో ఇప్పటి వరకూ దాదాపు 7.3 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. సెకెండ్ వేవ్ విజృంభించిన సమయంలో గతేడాది జూన్ 22న కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. కేవలం 40 రోజుల్లోనే రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు చేరడం గమనార్హం. దేశంలో తొలి కరోనా వైరస్ కేసు 2020 జనవరి 30న నమోదుకాగా.. అప్పటి నంచి కోటికి చేరడానికి 323 రోజులు పడితే.. 2 కోట్లకు చేరడానికి 136 రోజుల సమయం పట్టింది. 2020 డిసెంబరు 18న కోటి మార్క్ చేరాయి. ఆ తర్వాత మే 3, 2021లో రెండు కోట్లు, జూన్ 22న మూడు కోట్లుకు రోజువారీ కేసులు చేరాయి. అప్పటి నుంచి క్రమంగా కేసులు తగ్గడంతో 3.5 కోట్లకు చేరడానికి 196 రోజుల సమయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 4 నాటికి 3.5 కోట్లు కేసులు నమోదుకాగా.. కేవలం 21 రోజుల్లోనే అదనంగా 50 లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు. థర్డ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నా.. కరోనా మరణాలు ఇప్పటి వరకూ తక్కువగానే నమోదయ్యాయి. అయితే, గత పది రోజుల నుంచి క్రమంగా కోవిడ్ మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఏకంగా 27 శాతం మేర పెరిగాయి. ఆగస్టు 25, 2021 తర్వాత ఈ సంఖ్యలో మరణాలు పెరగడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో మంగళవారం 86 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత కేరళ (70), కర్ణాటక (52), తమిళనాడు (48), బెంగాల్ (36), ఢిల్లీ (31), పంజాబ్ (30), గుజరాత్ (28), చత్తీస్‌గఢ్ (23), రాజస్థాన్ (22), అసోం (19), హరియాణా (18) ఉన్నాయి. అటు, మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.87 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ముందు రోజుతో పోల్చితే ఈ సంఖ్య 30వేలు అధికం. ఇందులో అత్యధికంగా కేరళలో 55,475 కేసులు ఉన్నాయి. కేరళలో పాజిటివిటీ రేటు 49.4 శాతానికి చేరింది. జమ్మూ కశ్మీర్‌లోనూ అత్యధికంగా 6,570 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ మొదలైన తర్వాత ఈ సంఖ్యలో ఓ కేంద్రపాలిత ప్రాంతలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి.
By January 26, 2022 at 07:39AM
No comments