Nagarjuna Akkineni : బాయ్‌కాట్ ‘బంగార్రాజు’... నాగార్జున సినిమాపై ఎగ్జిబిటర్స్ గుర్రు
మాట చాలా విలువైనది. సందర్భానుసారం మాట్లాడే మాటలు మనకు మేలు చేస్తాయి. అందుకే మాట తూలకు.. జాగ్రత్తగా మాట్లాడు అని మన పెద్దలు అంటుంటారు. తాజాగా ఇప్పుడు ఇదే విషయం నాగార్జున విషయంలో నిజమైంది. అసలు నాగార్జునకి, మాట్లాడటానికి ఏంటి సంబంధం? అని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వెళితే, ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావాల్సిన RRR, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాలు కోవిడ్ ప్రభావం కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమాకు మార్గం సుగమనమైంది. ఈ సంక్రాంతికి చిన్న చిత్రాలు చాలానే వస్తున్నా, నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి వంటి స్టార్స్ ఉన్న మూవీగా బంగార్రాజు క్రేజును దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బంగార్రాజుపైనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై నాగార్జునను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన నేను స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడను. నా సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. రాజకీయాలు మాట్లాడను అనడం వరకు ఓకే. కానీ.. నా సినిమాకు ఏపీలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనడం చాలా మంది సినీ ప్రముఖులకు ఇబ్బందిగా అనిపించింది. వై.ఎస్ ఫ్యామిలీతో నాగార్జునకు సన్నిహిత సంబంధాలున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అది వారి వ్యక్తిగతం. కానీ సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది. నాగార్జున సీనియర్ స్టార్ హీరో. ఆయన ఇండస్ట్రీకి అనుకూలంగా మాట్లాడకపోయినా పరావాలేదు. కానీ.. నా సినిమాలకు ఇబ్బంది లేదు. మీ చావు మీరు చావండి అనే అర్థంలో మాట్లాడటం చాలా మంది ఎగ్జిబిటర్స్‌కు నచ్చలేదు. ముఖ్యంగా ఏపీలోని ఎగ్జిబిటర్స్ ఈ విషయంలో నాగార్జునపై గుర్రుగా ఉన్నారు. ALSO READ : అసలు ఇండస్ట్రీకి నాకు సంబంధమే లేదు అన్నట్లు వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి. టికెట్ రేట్స్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యంపై ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడుతూ లాజికల్‌గా ప్రశ్నలు వేస్తూ ఏపీ ప్రభుత్వ పెద్దలను ఓ రకంగా తెలియని ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలాంటిది నాగార్జునలాంటి ఓ హీరో.. మూడు తరాలుగా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలు నిర్మించి, సినిమాల నిర్మాణంలో చురుకుగా ఉంటున్నారు. తన సినిమా బాగుంటే చాలు అనుకుని వంటి హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మందికి మింగుడు పడటం లేదు. దీంతో సోషల్ మీడియాలో ‘బంగార్రాజు’ను బాయ్ కాట్ చేయాలంటున్నారు. ఏపీలోని ఎగ్జిబిటర్స్ అయితే బంగార్రాజు సినిమాను ప్రదర్శించకూడదని కూడా అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
By January 07, 2022 at 09:17AM
No comments