Breaking News

బీజేపీకి రాజీనామా.. పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పారికర్ కుమారుడు


దివంగత మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఉత్పల్ పారికర్‌ బీజేపీకి రాజీనామా చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ఉత్పల్ ప్రకటించారు. నా విలువల కోసం నిలబడే సమయం వచ్చిందని, నా రాజకీయ భవిష్యత్తును పనాజీ ప్రజలు నిర్ణయిస్తారని ఉత్పల్ వ్యాఖ్యానించారు. గోవాలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ఒకరైన మనోహర్ పారికర్.. మరణించే వరకూ 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈ స్థానం నుంచి పారికర్ కుమారుడు పోటీకి సన్నాహాలు చేసుకోగా.. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. ఇక్కడ మనోహర్ పారికర్ జీవితకాల ప్రత్యర్ధి, వివాదాస్పద ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెరట్టేకు టిక్కెట్ కేటాయించింది. ‘‘పార్టీ సభ్యులు మాత్రమే కాకుండా పనాజీలోని సాధారణ ప్రజల మద్దతు పొందిన నేను పార్టీని ఒప్పించడానికి గత, ఈ ఎన్నికల సమయంలో కూడా నా వంతు ప్రయత్నం చేశాను.. కానీ, పనాజీ నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు..రెండేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన అవకాశవాదికి ఇచ్చారు.. అందుకే నా రాజకీయ భవితవ్యాన్ని పనాజీ ప్రజలే నిర్ణయించేలా ముందుకు సాగాలనుకుంటున్నాను’’ అని ఉత్పల్ స్పష్టం చేశారు. తండ్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత పనాజీ ఉప-ఎన్నికల్లో పోటీకి ఉత్పల్ సముఖత వ్యక్తం చేసినా.. బీజేపీ మాత్రం వెనక్కు తగ్గించింది. పారికర్ అనుయాయుడు సిద్ధార్థ్ కున్‌కోయిలైకర్‌ను పోటీకి దింపింది. కానీ, అనూహ్యంగా ఈ ఉప-ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అటానాసియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత బీజేపీకి తొలి ఓటమి ఎదురయ్యింది. తదనంతర పరిణామాలతో ఎమ్మెల్యే అటానాసియో బీజేపీలో చేరారు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అటాసియో.. 2019 జులైలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. ఇక, ఉత్పల్‌కు పనాజీ సీటు నిరాకరించిన బీజేపీ.. ప్రత్యామ్నాయంగా మరో చోటు నుంచి పోటీచేయాలని సూచించింది. అయితే, ఉత్పల్ అందుకు నిరాకరించారు. బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తమ పార్టీలోకి రావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. మా పార్టీలో చేరితే పనాజీ నుంచి ఆప్ అభ్యర్థిగా నిలబెడతామని పేర్కొన్నారు.


By January 22, 2022 at 08:14AM


Read More https://telugu.samayam.com/manohar-parrikar-son-utpal-denied-ticket-from-panaji-seat-and-quits-bjp/articleshow/89051468.cms

No comments