యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడులు.. 100 మందికిపైగా ఖైదీలు దుర్మరణం
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై సౌదీ అరేబియా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి విమానాశ్రయంపై నాలుగు రోజుల కిందట డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేపట్టాయి. తాజాగా, యెమెన్ జైలుపై శుక్రవారం రాత్రి సంకీర్ణ దళాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఉత్తర యెమెన్‌లోని సాదాలో జరిగిన ఈ దాడుల్లో 100 మందికిపైగా ఖైదీలు దుర్మరణం చెందారని, 200 మందికి పైగా గాయపడ్డారని హౌతీ అధికారులు, వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను హౌతీలు శుక్రవారం విడుదల చేశారు. భవన శిథిలాల నుంచి మృతులను సహాయక సిబ్బంది బయటకు తీస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. హౌతీ తిరుగుబాటు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి తహా అల్ మోటావకేల్ మాట్లాడుతూ.. జైలుపై జరిగిన వైమానిక దాడిలో 70 మంది ఖైదీలు చనిపోయారని, అనేక మంది గాయపడటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణ యెమెన్‌లోని హోదాయ్‌పై కూడా వైమానిక దాడులు జరిగినట్టు హౌతీలు మరో వీడియోను విడుదల చేసింది. సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలు రాత్రికి రాత్రి జరిపిన వైమానిక దాడులతో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాప్తంగా అంతర్జాల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పలు డేటా ఎనాలిసిస్ కేంద్రాలు ధ్రువీకరించాయి. 12 గంటల తర్వాత వీటిని పునరుద్ధరించినట్టు తెలిపాయి. మరోవైపు, ఈ దాడులను నార్వే శరణార్థుల కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. హోదాయ్ వైమానిక దాడుల్లో కనీసం ముగ్గురు చిన్నారులు చనిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన సేవ్ చిల్డ్రన్స్ సంస్థ పేర్కొంది. హోదాయ్ ఫుట్‌బాల్ మైదానం సమీపంలోని పిల్లలు ఆడుకుంటుండగా వైమానిక దాడులతో విరుచుకుపడ్డారని తెలిపింది.
By January 22, 2022 at 08:50AM
No comments