Breaking News

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు


మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ యోధుడు బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించగా.. ఈ వార్తను జైరాం రమేష్ షేర్ చేస్తూ తన పార్టీ సహచరుడు ఆజాద్‌కు అవార్డు ప్రకటించడంపై పరిహాసంగా ట్వీట్ చేశారు. ‘‘భట్టాచార్య అలా చేయడం సరైంది.. అతను ఆజాద్ (స్వతంత్రుడు).. గులాం (బానిస)గా ఉండాలనుకోవడం లేదు’’అంటూ ద్వంద్వార్ధం జనించేలా జైరామ్ రమేష్ ట్వీట్ చేయడం గమనార్హం. అయితే, గులాం నబీ ఆజాద్‌కు పద్మవిభూషణ్‌ లభించినందుకు మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అభినందనలు తెలియజేశారు. ‘‘పద్మభూషణ్ అవార్డు పొందిన సందర్భంగా గులాం నబీ ఆజాద్‌కు హృదయపూర్వక అభినందనలు.. ఆయన ప్రజాసేవకు అవతలవైపు ప్రభుత్వం కూడా గుర్తించడం మంచిది’’ అని శశిథరూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి గతేడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో ఆజాద్ వీడ్కోలు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కంటితడి పెట్టుకున్న ఘటనను గుర్తుచేస్తూ అప్పటి ట్వీట్‌ను శశిథరూర్ ట్యాగ్ చేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానంపై లేఖాస్త్రం సంధించిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కూడా ఉన్నారు. చుక్కాని లేని నావలా తయారై, యువత సహా అన్ని వర్గాలకూ దూరమై, దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి పాతాళానికి దిగజారిపోతోందని, దీన్ని ఆపేందుకు సమగ్ర, సమూల, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు- అధినేత సోనియా గాంధీకి గతేడాది మార్చిలో ఓ లేఖ రాశారు.


By January 26, 2022 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-jairam-ramesh-criticise-party-colleague-gulam-nabi-azad-for-padma-award/articleshow/89129608.cms

No comments