Breaking News

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌


మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కు ఎదిగిన అతి కొద్ది మందిలో ర‌వితేజ ఒక‌రు. షోలో సినిమాతో సినీ రంగంపై ఆస‌క్తి పెంచుకున్న ర‌వితేజ‌కు చిత్ర సీమ రెడ్ కార్పెట్ వేయ‌లేదు. అవ‌కాశాల కోసం ఆయ‌న అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అలా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న న‌టుడిగా మారారు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒక‌డిగా, విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా క‌నిపించ‌టం ఇలా చిన్నా చిత‌కా వేషాలు వేసుకుంటూ వ‌చ్చారు. అయితే ఆయ‌న లైఫ్‌ని ట‌ర్న్ చేసిన సినిమా ‘నీకోసం’. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పుడు హీరోగా సినిమానా? అని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు మ‌రి. కొన్ని ఇబ్బందుల‌ను ప‌డి సినిమా విడుద‌లైంది. సినిమాకు చాలా మంచి పేరు వ‌చ్చింది. శ్రీనువైట్లకే కాదు.. హీరోగా ర‌వితేజ‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. అలాంటి త‌రుణంలో ర‌వితేజ‌కు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్‌. హీరోయిజాన్ని డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే పూరీ చేతిలో ర‌వితేజ ప‌డ‌గానే ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి ఎదిగారు. పూరీ త‌న హీరో ఎలా ఉండాల‌నుకుంటారో.. అంత‌కు ప‌ది రెట్లు ఉండేలా త‌న న‌ట‌న‌తో వెండితెర‌పై ఎస్టాబ్లిష్ చేశారు ర‌వితేజ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం హిట్ అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన ఇడియ‌ట్‌, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ రెండు సినిమాల స‌క్సెస్‌తో ర‌వితేజ స్టార్ హీరోగా మారిపోయారు. ఖ‌డ్గం, వెంకీ, భ‌ద్ర, విక్క‌మార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ‌, కిక్‌, మిర‌ప‌కాయ్‌, బ‌లుపు, క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌, శంభో శివ శంభో వంటి డిఫ‌రెంట్ మూవీస్‌లోనూ న‌టించారు. కొన్ని సినిమాల్లో పాత్ర‌ల‌కు నెరేట్‌గా కొత్త జీవం తెచ్చిన ర‌వితేజ‌.. గాయ‌కుడిగానూ పాటలు పాడిన సంద‌ర్భాల్లు కోకొల్ల‌లు. కొత్త ద‌ర్శ‌కుల‌ను, యంగ్ టాలెంట్‌ను ర‌వితేజ బాగా ఎంక‌రేజ్ చేస్తుంటారు. శ్రీనువైట్ల‌, గోపీ చంద్ మ‌లినేని, బోయ‌పాటి శ్రీను, కె.ఎస్‌.ర‌వీంద్ర‌, అనీల్ రావిపూడి వంటి ద‌ర్శ‌కుల‌తో ర‌వితేజ ప‌నిచేసి విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను అందించారు. 2021లో క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ర‌వితేజ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే ధ‌మాకా, రావ‌ణాసుర సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు ర‌వితేజ. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే గోల్‌గా దూసుకెళ్తున్న ర‌వితేజ పుట్టిన‌రోజు నేడు (జ‌న‌వ‌రి 26). ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇదే ఎన‌ర్జీతో మ‌రెన్నో పుట్టిన‌రోజుల‌ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది ‘స‌మ‌యం తెలుగు’.


By January 26, 2022 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mass-maharaj-ravi-teja-birthaday-special-article/articleshow/89130586.cms

No comments