Breaking News

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువు.. దైవంగా భావించి పూజలు!


ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న అరుదైన శిశువుకు జన్మినిచ్చిన ఘటన బిహార్‌లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలియడంతో ఆ శిశువును చూసేందుకు జనం ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండటంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అయితే, తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. కతిహార్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని హఫ్లగంజ్ గ్రామానికి చెందిన మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త రాజు సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే నవజాత శిశువుకు నాలుగేసి కాళ్లు, చేతులు ఉన్నాయని వైద్య సిబ్బంది చెప్పడంతో.... తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. కానీ, ఇదేం వింత శిశువు కాదని సదర్ ఆస్పత్రి మహిళా వైద్యురాలు శశికిరణ్ అన్నారు. గర్భధారణ సమయంలో.. కవలలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. ఆమె కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఈ విషయం ఎప్పుడూ వెల్లడికాలేదని అన్నారు. లోపల శిశువు ఎదగడం లేదన్న విషయాన్ని వైద్యులు కూడా తమతో చెప్పలేదని, ఇది ముమ్మాటికీ వారి నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్థానికులు మాత్రం ఇది మిరాకిల్ అని అంటున్నారు. ఇదంతా దైవలీల అని, శిశువును భగవంతుడు అవతారంగా భావించి ప్రార్థనలు చేయడం గమనార్హం. అయితే, మూడేళ్ల కిందట రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ కూడా ఇటువంటి శిశువుకి జన్మనిచ్చింది. టోంక్‌కు చెందిన రాజు గుర్జార్ అనే 24 ఏళ్ల మహిళ నాలుగు కాళ్లు, మూడు చేతులున్న ఆడపిల్లను ప్రసవించింది. అయితే, ఆమె గర్భంతో ఉన్న సమయంలో వైద్యులను సంప్రదించలేదు. దీంతో గర్భం లోపల పిండం ఎలా ఉందనేది తెలుసుకునే అవకాశం లేకపోయింది.


By January 19, 2022 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-gives-birth-to-baby-with-four-hands-and-legs-katihar-of-bihar/articleshow/88986241.cms

No comments