Breaking News

ప్రధాని రక్షణ కోసం నా ప్రాణాన్ని ఇచ్చేవాడ్ని.. కానీ, ఆయన సేఫ్‌: పంజాబ్ సీఎం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుధవారం పంజాబ్‌‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. భగత్‌సింగ్‌ సహా అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వెళ్తుండగా.. ఆందోళనకారులు బైఠాయించడంతో ఆయన కాన్వాయ్‌ ఫ్లైఓవర్‌పై ఆగిపోయింది. 20 నిమిషాలకుపైగా ఆయన కారులోనే ఉండిపోయారు. ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో ప్రధాని అర్ధాంతరంగా వెనుదిరిగారు. తిరిగి భటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, ఢిల్లీకి వచ్చేశారు. ఫిరోజ్‌పూర్‌ ర్యాలీకి కూడా హాజరు కాలేకపోయారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇది భద్రతాలోపమేనని పంజాబ్‌ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై నివేదిక కోరిన హోం శాఖ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ఫిరోజ్‌పూర్‌ ర్యాలీ ఫ్లాప్‌ అయిందని.. సభలో జనం లేకపోవడం వల్లే మోదీ వెనక్కి వెళ్లారని పంజాబ్‌ సర్కారు, కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి .. ఇది ఏమాత్రం భద్రతా వైఫల్యం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రధాని రక్షణ కోసం నా ప్రాణాలను ఇచ్చేవాడిని.. కానీ, ఆయన సురక్షితంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని రావాలనుకుంటే హెలికాప్టర్‌లో కూడా రావొచ్చు కదా అని ఆయన అన్నారు. పంజాబ్‌లో భద్రతా సమస్య లేదని కొట్టిపారేశారు. బీజేపీ నిర్వహించిన సభకు ఎవరూ రాలేదనే కారణంతోనే ర్యాలీని రద్దు చేసుకున్నారని చరణ్‌జిత్ ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు 70 వేల మందితో ప్లాన్ చేసిన సభకు కనీసం 700 మంది కూడా రాకపోవడంతో మోదీ వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. ఇది చెప్పలేక పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. పంజాబ్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మోదీ బుధవారం రాష్ట్ర పర్యటన తలపెట్టారు. మూడు సాగు చట్టాలను పార్లమెంటు రద్దుచేశాక తొలిసారి ఈ రాష్ట్రానికి రావడం గమనార్హం. దాదాపు రూ.46 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. శంకుస్థాపనలు చేయడానికి ఆయన బుధవారం ఉదయం భటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత జాతీయ అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్లో హుస్సేనీవాలాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్‌ సభకు బయల్దేరాలి. అయితే వర్షం, పొగమంచు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు వేచిచూశారు. చివరకు రోడ్డుమార్గాన స్మారకం వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. రోడ్డు ప్రయాణానికి రెండు గంటలు పడుతుందని, అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని పంజాబ్‌ డీజీపీ ధ్రువీకరించడంతో మోదీ కాన్వాయ్‌ బయల్దేరింది. కానీ, మెమోరియల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కాన్వాయ్‌‌ను ఓ ఫ్లైఓవర్‌ వద్ద కొందరు ఆందోళనకారులు బ్లాక్‌ చేశారు. దీంతో 15-20 నిమిషాలు ప్రధాని ఫ్లైఓవర్‌పైనే ఉండిపోవలసి వచ్చింది. ప్రయివేట్ వాహనాలు మోదీ కాన్వాయ్‌కు సమీపంగా వెళ్తుండడంతో ప్రత్యేక భద్రతా దళం (ఎస్‌పీజీ) అప్రమత్తమై దాని చుట్టూ మోహరించింది.


By January 06, 2022 at 07:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/would-give-my-life-to-protect-pm-modi-but-he-was-safe-says-punjab-cm-channi/articleshow/88723641.cms

No comments