Breaking News

ఈదురు గాలులతో నౌక మునక.. 11 మంది భారతీయ సెయిలర్స్‌ను రక్షించిన ఇరాన్


ప్రతికూల వాతావరణంతో తమ తీరంలో మునిగిపోయిన నౌకలోని 11 మంది భారతీయ నావికులను రక్షించినట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ మీదుగా ఈ నౌక ఒమన్‌లోని సోహర్‌కు వెళుతుండగా సముద్రంలో బలమైన గాలులు, ప్రతికూల వాతావరణంతో పాటు సాంకేతిక లోపం తలెత్తిందని జాస్క్ కౌంటీ గవర్నర్ అలీ మెహ్రనీ చెప్పారని ఇరాన్ మీడియా ఐఆర్ఐబీ పేర్కొంది. ఒమన్‌కు పంచదారతో వెళ్తున్న ఈ నౌక దక్షిణ హోర్మోజ్‌గాన్ ప్రావిన్సుల్లోని గాబ్రిక్ జిల్లాకు నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో బుధవారం మునిగిపోయిందని వివరించింది. అయితే, నౌకలోని సిబ్బంది అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి అరబ్ దేశాలతో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతంలో వాతావరణం కల్లోలంగా ఉంది. వాతావరణ విభాగాలు పలు హెచ్చరికలు కూడా చేశారు. ఇటీవల ఇరాన్‌లోని ఫార్స్, హోర్మోజ్‌గాన్, కెర్మాన్, సిస్తాన్-బలూచిస్తాన్ (ఆగ్నేయ) వంటి దక్షిణ ప్రావిన్సులలో అకాల వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా తొమ్మిది మరణించినట్టు ఇరాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ఎస్మాయిల్ నజ్జర్ వెల్లడించారు. ఫార్స్ ప్రావిన్సుల్లో ఐదుగురు, కెర్మాన్, సిస్తాన్-బలూచిస్థాన్‌‌లో ఇద్దరు చొప్పున చనిపోయినట్టు పేర్కొన్నారు. ఒక్క మంగళవారమే ఎనిమిది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇరాన్ ప్రెసిడెండ్ ఇబ్రహీం రైసీ హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరాన్ ఉపాధ్యాక్షలు మొహ్మద్ మోఖ్బీర్, ఇంధన శాఖ మంత్రి అలీ అక్బర్ మెహాబ్రియన్ సహా అధికారులు పర్యటించారు. చివరిసారిగా 2019లో ఇరాన్‌లో భారీ వరదలు సంభవించి 76 మంది చనిపోయారు. 2 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం సంభవించింది. వాతావరణ మార్పుల వల్లే ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పుల తీవ్రత కరువులను పెంచుతాయని, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


By January 06, 2022 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/rescues-11-indian-sailors-after-vessel-sink-their-water-says-iran-media/articleshow/88724130.cms

No comments