Breaking News

పెను విషాదం.. అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 12 మంది సజీవదహనం


అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సజీవదహనమైన విషాద ఘటన అమెరికాలో బుధవారం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్‌లో ఓ మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి మరో ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. అమెరికాలో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ఇదే కావడం బాధాకరం. ఈ ప్రమాదంలో ఏడాది పాప, ఎనిమిది మంది చిన్నారుల సహా 12 మంది సజీవదహనమయ్యారు. ‘ప్రమాదంలో నా సోదరీమణులు, వారి పిల్లలు చనిపోయారు. వారు మళ్లీ తిరిగి రారు’ బాధిత కుటుంబానికి చెందిన ఓ మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మొత్తం ఎనిమిది పిల్లలు మంటలకు ఆహుతయ్యారని, వీరిలో ఏడాది పాప కూడా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అమెరికాలో శీతాకాలంలో పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు భారీగా కురుస్తున్న మంచు తుఫాను వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు తుఫానే తాజా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కెన్నీ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది నిస్సందేహంగా మా నగర చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి... ఇంత విషాదకరమైన రీతిలో చాలా మందిని కోల్పోవడం బాధాకరం’అని జిమ్ కెన్నీ అన్నారు. ఫిలడెల్ఫియా అగ్నిమాపక శాఖ డిప్యూటీ కమిషనర్ క్రెయిగ్ మర్ఫీ మాట్లాడుతూ.. తన 35 ఏళ్లలో కెరీర్‌లో చూసిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. మంటలకు కారణమేమిటో చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. అయితే, ప్రమాదం వెనుక తమకు ఎటువంటి అనుమానాల్లేవని చెప్పారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నట్టు గుర్తించామని.. అయినా ఒక్కటి కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు.


By January 06, 2022 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/eight-children-among-12-dead-in-house-fire-philadelphia-of-us/articleshow/88725641.cms

No comments