Breaking News

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు: 7 నెలల తర్వాత లక్షకుపైగా కొత్త కేసులు


దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏడు నెలల తర్వాత లక్షకుపైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. సెకెండ్ వేవ్‌లో చివరిసారిగా 2021 జూన్ 6న లక్ష కొత్త కేసులు నమోదుకాగా.. 214 రోజుల తర్వాత మళ్లీ అదేస్థాయిలో బయటపడ్డాయి. రోజువారీ కేసులు 10,000 మార్క్ దాటిన ఎనిమిది రోజుల్లోనే లక్షకు చేరుకోవడం గమనార్హం. దేశంలో కొత్తరకం వేరియంట్ ప్రవేశించిన తరువాత అపూర్వ వేగంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారం దేశవ్యాప్తంగా దాదాపు 1,17,000 కొత్త కేసులు బయటపడ్డాయి. బుధవారం నమోదయిన 90,889 కేసులతో పోల్చితే ఇది 29 శాతం అధికం. ఫస్ట్ వేవ్‌లో రోజువారీ కేసులు లక్షకు చేరడానికి 103 రోజులు పడితే.. రెండో వేవ్‌లో 47 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం రోజువారీ కేసులు వ్యాప్తి సెకెండ్ వేవ్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. రెండో దశలో గరిష్టంగా 4 లక్షలు కేసులు నమోదుకాగా.. వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఆ మార్క్‌ను కొన్ని రోజుల్లోనే అధిగమించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిసెంబరు 28 నుంచి గత 10 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 35 శాతానికి ఎగువనే ఉంది. గురువారం మాత్రం స్వల్పంగా తగ్గింది. మంగళ, బుధవారాలు ఏకంగా 56 శాతం మేర నమోదుకావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసులు కూడా భారీగా పెరిగాయి. 15 రోజుల కిందట 75 వేలుగా ఉన్న యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం 3.5 లక్షలు దాటేశాయి. డిసెంబరు 31న లక్ష ఉండగా... నాలుగు రోజుల్లోనే 2 లక్షలకు చేరుకున్నాయి. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. గురువారం అక్కడ మొత్తం 36,265 కొత్త కేసులు బయటపడగా... ఒక్క ముంబయిలోనే 19,780 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మొదలైన తర్వాత ఈ సంఖ్యలో అక్కడ రోజువారీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. బెంగాల్‌లో ముందురోజుతో పోల్చితే గురువారం కేసులు స్వల్పంగా పెరిగాయి. మొత్తం అక్కడ 15,421 కొత్త కేసులు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటకలో రోజువారీ కేసులు 5 వేలు దాటాయి. తమిళనాడు 6,983, కర్ణాటక 5,031, కేరళ 4,649, గుజరాత్ 4,213, ఝార్ఖండ్ 3,704 కేసులు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గురువారం అక్కడ కొత్తగా 3,121 కేసులు వెలుగుచూశాయి. దీంతో హరియాణా 2,678, రాజస్థాన్ 2,400, బిహార్ 2,379, తెలంగాణ 1,900, ఆంధ్రప్రదేశ్ 547 కొత్త కేసులు బయటపడ్డాయి.


By January 07, 2022 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-daily-covid-cases-surge-past-1-lakh-after-7-months/articleshow/88745503.cms

No comments