Breaking News

తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హతం


ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురికిపైగా నక్సలైట్లు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు మహిళలున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. చర్ల మండలం చిన్న చెన్నాపురం సమీపంలోని సుక్మా- బీజాపుర్ జిల్లా కిష్టాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. కిష్టాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు ఎస్పీ చెప్పారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని అన్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, నక్సల్స్ కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఎస్పీ వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టుల్లో కీలక నేతలున్నట్టు సమాచారం. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఏరియాలో మావోయిస్టుల పలు విధ్వంసాలకు పాల్పడడంతో ఇరు రాష్ట్రాలూ సంయుక్తంగా భారీ ఎత్తున కూంబింగ్‌లు కొనసాగిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో రెండు ఐఈడీలను గుర్తించిన కొద్ది గంటల్లోనే ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. భద్రత బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఐఈడీలను అమర్చగా.. సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అబుజ్‌మద్, బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులకు స్థానికుల మద్దతు క్రమంగా కోల్పోతుండటంతో పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలను అమర్చుతున్నారు.


By December 27, 2021 at 12:02PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-six-maoist-killed-in-encounter-with-police-along-chhattisgarh-telangana-border/articleshow/88518045.cms

No comments