సెంటు వ్యాపారి ఇంట్లో రూ.257 కోట్ల నగదు.. కిలోల కొద్దీ బంగారం..అవాక్కయిన అధికారులు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, నేత పీయూష్ జైన్ నివాసంలో జీఎస్‌టీ, ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఈ సోదాల్లో రూ.284కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీయూష్ జైన్ భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పీయూష్ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత వారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో గుట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తంగా రూ.284కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు వివిధ ప్రాంతాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, ఢిల్లీలో ఒకటి ఉన్నట్టు గుర్తించగా.. దుబాయ్‌లో మరో రెండు ఆస్తులున్నట్లు తేలింది. ఆదివారం నాటి సోదాల్లో మరో రూ.10 కోట్లు నగదు బయటపడింది. కన్నౌజ్‌లోని పీయూష్ జైన్ పూర్వీకుల నివాసంలో 18 లాకర్లను గుర్తించిన అధికారులకు.. వీటికి సంబంధించి మరో 500 తాళాలు కూడా లభించినట్టు సమాచారం. ఆ లాకర్లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మొదలైన తనిఖీలు.. ఆదివారం వరకు సాగాయి. దాదాపు 50 గంటల పాటు పీయూష్ జైన్‌ను విచారించిన అనంతరం ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతతో మొత్తంగా రూ. 1000కోట్ల వరకు కూడబెట్టినట్టు భావిస్తున్నారు. పీయూష్ ఇంట్లో నోట్ల కట్టల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీలో క్రీయాశీలక సభ్యుడైన పియూష్ జైన్.. ఇటీవల ‘సమాజ్‌వాదీ సెంట్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన పర్ఫ్యూమ్‌ను ఆయన కంపెనీలోనే తయారు చేశారు. ఆయన ఫ్యాక్టరీలో లెక్కల్లో చూపని కోట్లాది రూపాయల విలువైన శాండల్‌వుడ్ ఆయిల్, పర్ఫ్యూమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే యూపీ అసెంబ్లీకి ఎన్నికల జరగనుండగా సోదాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చరిత్రలోనే ఇదే మొదటిసారని ఆ సీబీఐసీ ఛైర్మన్ వివేక్ జోహ్రీ అన్నారు.
By December 27, 2021 at 12:37PM
No comments