బ్రిటిష్ రాయల్ గార్డ్స్ కవాతులో అనూహ్య ఘటన.. వైరల్ అవుతోన్న వీడియో
బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్ వద్ద జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సందర్శకులతో సందడిగా ఉన్న సమయంలో ఇద్దరు రాయల్ గార్డులు గంభీరంగా కవాతు చేసుకుంటూ వెళ్తుండగా.. హఠాత్తుగా ఓ బాలుడు వారికి అడ్డుగా వచ్చాడు. గార్డు కాళ్లకింద పడిపోయినా అతడు ఆగకుండా చిన్నారిపై నుంచి అలాగే వెళ్లిపోయాడు. అయితే, కిందపడిపోయిన బాలుడు వెంటనే లేవడంతో.. అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఓ టిక్‌టాక్ యూజర్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, ఈ వీడియోకు 3.3 మిలియన్లకుపైగా వ్యూస్.. వేలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన యూకే రక్షణ మంత్రిత్వశాఖ.. దీని గురించి తమకు తెలుసని ఒక ప్రకటనలో తెలిపింది. గార్డులు వస్తున్నారని ముందస్తుగానే హెచ్చరించామని, కానీ.. దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైనికుడికి అతి సమీపంలో వెళ్లినట్లు పేర్కొంది. అయినప్పటికీ.. ఆ సైనికుడు అతన్ని దాటే అడుగేసినట్లు, అనంతరం ఆ చిన్నారిని పరామర్శించినట్లు తెలిపింది. ‘క్వీన్స్ గార్డ్’ బృందం.. దాదాపు నాలుగు శతాబ్దాలుగా బ్రిటన్‌లోని రాచరిక నివాసాల వద్ద రక్షణ విధులు నిర్వహిస్తుంది. క్రీ.శ. 1660 నుంచి వీరితోనే భద్రత కొనసాగుతోంది. కాగా, ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు ఈ కవాతు సంప్రదాయాన్ని విమర్శించడంతో పాటు గార్డుల ప్రవర్తనపై మండిపడుతున్నారు. కొందరు మాత్రం గార్డుల తమ విధినిర్వహణలో భాగంగా అలా చేయాల్సి వచ్చిందని సమర్ధిస్తున్నారు.
By December 31, 2021 at 08:00AM
No comments