దేశంలో కరోనా ఉద్ధృతం.. కేవలం మూడు రోజుల్లోనే 3 రెట్లు పెరిగిన కేసులు
దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసుల్లో పెరుగుదల నమోదయ్యింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,700 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోల్చితే ఇవి 27 శాతం అధికం. అంతేకాదు, సోమవారం నుంచి రోజువారీ కేసుల్లో పెరుగుదల 2.6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. గురువారం రాత్రి వరకూ దేశవ్యాప్తంగా 16,695 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 71 రోజుల తర్వాత రోజువారీ కేసుల్లో ఈ స్థాయిలో నమోదయ్యాయి. చివరిసారిగా అక్టోబరు 20న దేశంలో 18,388 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. బుధవారం 13,180 కేసులు నిర్ధారణ కాగా.. గురువారం నాటికి 27 శాతం పెరుగుదల నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల్లోనే 10 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అతిపెద్ద మెట్రో నగరాలైన ముంబయి, ఢిల్లీ, బెంగళూరులో రోజువారీ పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. కేరళ మినహా పలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు, మహారాష్ట్రలో రోజువారీ కేసుల్లో దాదాపు 40 శాతం పెరుగుదల నమోదయ్యింది. గురువారం అక్కడ 5,368 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. ఒక్క ముంబయిలోనే 3,555 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది మే 5 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి. పశ్చిమ్ బెంగాల్‌లోనూ బుధవారంతో పోల్చితే గురువారం పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. బుధవారం ఆ రాష్ట్రంలో 1,089 కేసులు బయటపడగా.. గురువారం ఏకంగా 2,128 మంది వైరస్ బారినపడ్డారు. కోల్‌కతా నగరంలో కేసుల వృద్ధి రేటు 102 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కొత్తగా 1,313 కేసులు బయటపడ్డాయి. కేరళలోనూ వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మహారాష్ట్ర తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే బయటపడ్డాయి. అయితే, గతవారంతో పోల్చితే అక్కడ పాజిటివిటీ రేటు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. తమిళనాడులో 890, కర్ణాటకలో 707 కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల భారీగానే ఉంది. రాజస్థాన్ (92 శాతం), బిహార్ (71 శాతం), పంజాబ్ (67 శాతం), గోవా (54 శాతం), చత్తీస్‌గఢ్ (42 శాతం), ఝార్ఖండ్ (40 శాతం), హరియాణా (38 శాతం) పెరుగుదల నమోదయ్యింది.
By December 31, 2021 at 07:26AM
No comments