కశ్మీర్‌లో సైన్యానికి భారీ విజయం.. ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ముష్కరుల హతం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. నాలుగు రోజుల కిందట ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం.. తాజాగా మరో ఆరుగుర్ని మట్టుబెట్టింది. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులున్నట్టు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. , కుల్గామ్ జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్‌లోని నౌగామ్, కుల్గామ్‌లోని మిర్హామ్‌లో బుధవారం సాయంత్రం నుంచి భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో జైషే మహ్మద్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగామ్, మిర్హామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ, పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ‘రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఇద్దరు పాక్ జాతీయులు సహా నలుగుర్ని ఇప్పటి వరకూ గుర్తించాం.. మిగతా ఇద్దర్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.. సైన్యానికి ఇదో భారీ విజయం’ అని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. తొలుత నౌగామ్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ గాయపడినట్టు తెలిపారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పాక్ జాతీయుడు సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు పేర్కొన్నారు. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ ప్రారంభమైన కొద్దిసేపటికే మిర్హమ్‌లోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరొకరు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
By December 30, 2021 at 08:55AM
No comments