Breaking News

భారత్‌లో 200 ఒమిక్రాన్ కేసులు.. అత్యధికంగా ఆ రాష్ట్రాల్లోనే నమోదు


దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య 200కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులన్నీ 12 రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రలో 54 కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్ఠాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తర్ ప్రదేశ్‌లో 2, ఏపీ, చంఢీగడ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 77 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కేసులు నమోదైన అప్రమత్తమై వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని అధికారులు ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా అప్రమత్తం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆస్పత్రుల్లోనూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్ 89 దేశాలకు విస్తరించింది. బ్రిటన్‌, అమెరికాలో ఈ వేరియంట్‌తో మరణాలు కూడా సంభవించాయి. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 73 శాతానికి పెరిగాయి. మొదటి నుంచి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆయా దేశ ప్రభుత్వాలు ఒమిక్రాన్ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి.


By December 21, 2021 at 01:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/total-omicron-cases-in-india-200/articleshow/88407745.cms

No comments