Breaking News

US Defence Report భారత్ భూభాగంలో చైనా గ్రామం.. పెంటగాన్ నివేదికపై స్పందించిన కేంద్రం.. కీలక వ్యాఖ్యలు


భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో 100 నివాసాలతో చైనా కొత్తగా ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసినట్టు అమెరికా రక్షణ విభాగం వెల్లడించిన విషయం తెలిసిందే. పెంటగాన్ నివేదికపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. గత కొన్నేళ్లుగా ఆక్రమించుకున్న భారత్ భూభాగం సహా సరిహద్దుల వెంబడి చైనా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. దీనిని భారత్ ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ‘గడచిన కొన్నేళ్లుగా ఆక్రమించుకున్న భారత్ భూభాగం సహా సరిహద్దుల వెంబడి చైనా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించడాన్ని భారతదేశం అంగీకరించదు లేదా అన్యాయమైన చైనా వాదనలను ఒప్పుకోబోదు.. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇదే విషయాన్ని చైనాకు తెలియజేస్తుంది.. దీనిని కొనసాగిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటనలో తెలిపారు. ‘భారత్ తన భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది.. మన సార్వభౌమాధికారం.. ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.. చైనాతో సరిహద్దుల్లో రహదారులు, వంతెనలు సహా మౌలికసౌకర్యాల అభివృద్ధి పనులు వేగవంతం చేసింది’ అని ఆయన తెలిపారు. పెంటగాన్ నివేదికపై మాట్లాడుతూ.. ‘అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదిక భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా తూర్పు సెక్టార్‌లో చైనావైపు నిర్మాణ కార్యకలాపాలను కూడా సూచిస్తుంది... ఈ విషయంపై ఈ ఏడాది ప్రారంభంలో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి’ అని అన్నారు. ‘2020లో PRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) LAC తూర్పు సెక్టార్‌లోని టిబెట్ స్వయం ప్రతిపత్తి, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య వివాదాస్పద భూభాగంలో 100-ఇళ్లతో గ్రామాన్ని నిర్మించింది’ అని పెంటగాన్ నివేదిక తెలిపింది. పెంటగాన్ నివేదికను అధ్యయనం చేసిన భారత ఆర్మీ వర్గాలు తాజాగా ఈ వివాదంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లో లేదని, చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో మాత్రమే ఉందని ఆర్మీ వర్గాలు వివరణ ఇచ్చాయి. అంతేకాదు, ఈ గ్రామం నిర్మాణం ఆరు దశాబ్దాల కిందటే మొదలైందని పేర్కొన్నాయి. 1959లో భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో నిర్మించిందని..అసోం రైఫిల్స్‌తో పోరులో విజయం సాధించిన తర్వాత దీన్ని చైనా నిర్మించిందని తెలిపాయి. భారత్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని అక్రమించిన చైనా అక్కడ తమ రక్షణ అవసరాల కోసం గ్రామాన్ని నిర్మించినట్లు అధికారులు చెప్తున్నారు. అరుణాచల్‌లో ఇంత తక్కువ సమయంలో చైనా అంత పెద్ద గ్రామం నిర్మించే పరిస్ధితులు ప్రస్తుతం లేవని భద్రతాదళ అధికారులు వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల పరిధిలో చైనా 628 జియాకాంగ్ మోడల్ రక్షణ గ్రామాలను అనేకం నిర్మించిందని, ఇవన్నీ వారి భూభాగంలోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.


By November 12, 2021 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-comments-on-china-construction-a-village-in-arunachal-pradesh-by-petagon-report/articleshow/87658283.cms

No comments