Breaking News

Tirupati అమిత్ షా అధ్యక్షతన సదరన్ కౌన్సిల్ భేటీ.. కేసీఆర్ సహా ఆ ఇద్దరూ గైర్హాజరు!


తిరుపతిలో ఆదివారం జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి రంగం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. హోం మంత్రి శనివారం సాయంత్రమే తిరుపతికి చేరుకున్నారు. అయితే, తెలంగాణ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకావడంం లేదు. తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తడంతో.. సీఎం ఎంకే స్టాలిన్‌ సొంత నియోజకవర్గం పర్యటనకు వెళుతున్నందున ఈ సమావేశానికి రావడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదివారం ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. కేరళ ముఖ్యంత్రి పినరయి విజయన్ సైతం సమావేశానికి హాజరు కావడం లేదు.. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి, సీఎస్‌ హాజరవుతున్నారు. లక్షద్వీప్‌ పరిపాలనాధికారి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎస్‌లు, ముఖ్య అధికారులు శనివారమే తిరుపతికి చేరుకున్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం రాష్ట్రాల ప్రతినిధుల ప్రసంగిస్తారు. చివరిగా కేంద్ర హోం మంత్రి మాట్లాడతారు. రాష్ట్రాల మధ్య నెలకున్న సరిహద్దు వివాదాలు, భద్రత అంశాలు, రోడ్లు, రవాణా, పరిశ్రమలు, జల, విద్యుత్ సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సహకార, పోటీ సమాఖ్యవాదాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.. రాష్ట్రాలకు సాధికారత కల్పించడానికి, విధానపర అంశాలలో కేంద్రం, రాష్ట్రాల మధ్య మంచి అవగాహనను ప్రోత్సహించేలా సహకార సమాఖ్య వ్యవస్థ దృక్పథాన్ని హోం మంత్రి వివరించననున్నారు’ అని ఈ ప్రకటనలో వివరించారు. ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రం, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చలు, నిర్మాణాత్మక యంత్రాంగం ద్వారా అటువంటి సమస్యల పరిష్కారానికి సహకారాన్ని పెంపొందించడంలో జోనల్ కౌన్సిల్‌లు ఒక వేదికను కల్పిస్తాయి.. రాష్ట్రాలు బలంగా ఉంటే బలమైన దేశంగా మారుతుంది.. వివాదాల పరిష్కారం, సహకార సమాఖ్యను ప్రోత్సహించడానికి జోనల్ కౌన్సిల్ వేదికను ఉపయోగించుకోవాలని’ అమిత్ షా షా నొక్కిచెప్పారు. తొలిసారిగా శ్రీవారి పాదాల చెంత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని.. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అభివృద్ధికి అడుగులు పడాలనే సంకల్పంతో ఏర్పాటైన కౌన్సిల్‌ 29వ సమావేశానికి సభ్య రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.


By November 14, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kcr-stalin-and-vijayan-not-attend-to-southern-zonal-council-meet-in-tirupati-on-today/articleshow/87694148.cms

No comments