Breaking News

Prashant Kishor రాజీనామా ఉపసంహరణ.. కొత్త మెలిక పెట్టిన సిద్ధూ.. పీకేపై కీలక వ్యాఖ్యలు


పంజాబ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ విజయానికి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తారని పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీనిపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించే అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో సిద్ధూ మాట్లాడుతూ.. ‘పార్టీ నిర్ణయిస్తుంది.. ఆయనను (ప్రశాంత్ కిశోర్)‌ సీఎం తీసుకోవాలని భావిస్తే అధిష్ఠానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు. అలాగే, పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు సిద్ధూ తెలిపారు. అయితే, అడ్వకేట్ జనరల్‌ను మార్చిన రోజే పీసీసీ కార్యాలయంలోకి అడుగుపెడతానని కొత్త మెలిక పెట్టారు. తనను సంప్రదించకుండా డీజీపీ, అడ్వకేట్ జనరల్‌ను నియమించడం పట్ల ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా సమస్యలపై జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ఇంఛార్జ్ హరీశ్ చౌధరి.. పీకేను వ్యూహకర్తగా నియమించాలని సిఫార్సు చేశారు. అయితే, ఈ ఏడాది మార్చిలో పీకేను తన ముఖ్య సలహాదారుగా మాజీ సీఎం అమరీందర్ సింగ్ నియమించారు. కానీ, ఆగస్టులో ప్రశాంత్ కిశోర్ ఆ పదవి నుంచి తప్పుకుని, తాను 2022 ఎన్నికల్లో భాగస్వామి కాలేనని పేర్కొన్నారు. పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రశాంత్ కిశోర్ పలుసార్లు సమావేశం కావడంతో ఆయన ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఇటీవల కాంగ్రెస్ పార్టీపై పలు సందర్భాల్లో పీకే విమర్శలు గుప్పించడంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. అనేక దశాబ్దాలుగా బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదని, రాహుల్‌గాంధీకి ఉన్న సమస్య ఏమిటంటే అది గ్రహించకపోవడమేనని ప్రశాంత్ కిషోర్ గోవాలో వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 40 సంవత్సరాలు కాంగ్రెస్‌ ఉన్నట్లుగానే, గెలిచినా లేదా ఓడిపోయినా రాబోయే సంవత్సరాల్లో భారత రాజకీయాలలో బీజేపీ కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు.


By November 06, 2021 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/poll-strategist-prashant-kishor-for-congress-punjab-campaign-what-navjot-sidhu-says/articleshow/87547654.cms

No comments