Breaking News

కొన్నేళ్లలో మునిగిపోనున్న విశాఖ సహా దేశంలోని 12 నగరాాలు.. నాసా సంచలన నివేదిక


వాతావరణ మార్పులపై గ్లాస్గో వేదికగా జరిగిన సదస్సులో ప్రపంచ నేతలు పాల్గొని, కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. వాతావరణం వేడెక్కుతున్న ప్రస్తుత పోకడ కొనసాగితే ఈ శతాబ్దం ముగిసేనాటికి వాతావరణాలు 3 నుంచి 5 సెంటీగ్రేడ్స్ మధ్య పెరగవచ్చునని డబ్ల్యూఎంఓ చెబుతోంది. గతంతో పోలిస్తే వాతావరణంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకుంటున్నాయి . అందుకే అకాల వర్షాలు, వరదలు.. ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రమంలో సముద్రమట్టం కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో సముద్రతీర ప్రాంతాలు, వ్యవసాయ పంటలకు పెను ముప్పు తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యయనం పేర్కొంటోంది. ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ)ని ఉపయోగించి సముద్రాల్లో మార్పులను నాసా విశ్లేషించగా భయంకర విషయాలు బయటపడ్డాయి. ఈ ఫలితాలను నేచుర్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురించారు. 2030కి ముందే జొన్న, గోధుమ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాసా అధ్యయనం హెచ్చరించింది. గ్రీన్‌హౌస్ వాయువులు ఇలాగే పెరిగితే మొక్కజొన్న సేద్యం 24 శాతం మేర తగ్గిపోనుండగా.. గోధుమ పంట విస్తీర్ణం 17 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ‘ఉష్ణోగ్రతలు పెరుగుదల, వర్షపాతంలో మార్పులు, మానవాళి చర్యలతో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల నుంచి పెరిగిన ఉపరితల కార్బన్ డయాక్సైడ్ సాంద్రతల వల్ల మొక్క జొన్న పంటకు ప్రతికూలంగా మారుతాయి.. కానీ, గోధుమ విస్తీర్ణం పెరుగుతుంది’ అని పేర్కొంది. ‘మునుపటి తరం వాతావరణం, 2014లో నిర్వహించిన పంట నమూనాల నుంచి దిగుబడి అంచనాలతో పోలిస్తే, అటువంటి ప్రాథమిక మార్పులను చూస్తామని మేము ఊహించలేదు.. ప్రస్తుత ఉత్పత్తి స్థాయిల నుంచి 20% తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలను కలిగిస్తుంది’ అని నాసా గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ శాస్త్రవేత్త జొనాస్ జగెర్‌మైర్ అన్నారు. ఇక, ఉష్ణోగ్రతల ప్రభావంతో సముద్రమట్టం పెరిగి, తీర ప్రాంతాల్లో నగరాలకు ముప్పు వాటిళ్లనుందని అధ్యయనం తెలిపింది. భారత్‌లోని తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, 30 నగరాలు ప్రభావితం కానున్నాయని తెలిపింది. ముఖ్యంగా 12 తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. భారత్‌లో సముద్ర మట్టాలు వచ్చే రెండు దశబ్దాల్లో 0.1 నుంచి 0.3 మీటర్ల వరకూ పెరుగుతాయని, గుజరాత్‌లోని భవనగర్ వద్ద 0.22 మీటర్ల మేర పెరుగుతుందని పేర్కొంది. ఐపీసీసీ నివేదిక ప్రకారం.. ప్రస్తుత వాతావరణ మార్పులు, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి భవనగర్ (0.22), కోచి (0.15), ముర్ముగోవా, కాండ్లా, ఓఖా 0.13 చొప్పున, ముంబయి 0.12 మీటర్ల మేర నీటి మట్టాలు పెరుగుతాయి. ఈ శతాబ్దం చివరి నాటికి ముంబయి (మహారాష్ట్ర) 1.90 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందని హెచ్చరించింది. చెన్నై 1.87 అడుగులు, భవనగర్ 2.70 అడుగులు, మంగళూరు 1.87 అడుగులు, ముర్ముగావ్‌ 2.06 అడుగులు, ట్యూటికోరిన్‌ 1.90 అడుగులు, బెంగాల్‌లోని కిదిర్‌పూర్‌ 0.49 అడుగులు, ఒడిశాలోని పారాదీప్‌ 1.93 అడుగులు, గుజరాత్‌లోని ఒఖా 1.96 అడుగులు, విశాఖపట్నం 1.77 అడుగులు, కాండ్లా 1.87 అడుగులు మేర సముద్రంలో మునిగిపోతాయని అంచనా వేసింది.


By November 06, 2021 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/climate-change-impact-the-world-corps-and-cities-to-see-sea-levels-rise-in-30-years-says-nasa/articleshow/87547249.cms

No comments