Lakhimpur Kheri యూపీ సిట్‌పై మాకు నమ్మకం లేదు.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు
లఖింపూర్ ఖేర్ కేసులో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన మధ్యంతర నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీ సిట్ ఆధారాలను నమోదు చేస్తున్న తీరుపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించింది. సాక్షుల వాంగ్మూలం నమోదును పర్యవేక్షించడానికి, ఇతర కేసులతో కలపకుండా నిరోధించడానికి పంజాబ్ హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్‌ను నియమించాలని సూచించింది. అలాగే, కేసులో నిందితుల మొబైల్ ఫోన్‌లను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని యూపీ పోలీసులను ప్రశ్నించింది. ఇతర నిందితులు సెల్‌ఫోన్‌లు ఉపయోగించలేదా? అని ప్రశ్నించింది. ‘దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదు’ అని పోలీసులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. ‘యూపీ పోలీసుల లెక్కల ప్రకారం.. రైతులపై వాహనం ఎక్కించిన ఘటనలో 16 మంది నిందితులు ఉన్నారు.. అందులో ముగ్గురిని కొట్టి చంపారు.. మీరు ఒక నిందితుడి ఫోన్‌ను ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? మిగిలిన నిందితులు తమ మొబైల్‌లను పారేశారని మీరు స్టేటస్ రిపోర్ట్‌లో ఎక్కడ చెప్పారని, కానీ, పోలీసులు CDR లను స్వాధీనం చేసుకున్నారా?’ అది ప్రశ్నించింది. ‘సాక్షుల వాంగ్మూలాలను నిర్దిష్ట పద్ధతిలో నమోదు చేయడం ద్వారా నిందితుడు ప్రయోజనం పొందుతున్నాడని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం... అలాంటప్పుడు అప్పుడు విచారణ ఏమవుతుంది’ అని నిలదీసింది. అయితే, కేసును సీబీఐ విచారణకు అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అనంతరం వచ్చే వారానికి విచారణను వాయిదా వేసింది. అక్టోబరు 3న వద్ద ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లి 4 రైతులు అక్కడిక్కడే చనిపోయారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
By November 08, 2021 at 12:42PM
No comments