Breaking News

Diwali 2021 జాతీయ సెలవు దినంగా దీపావళి.. అమెరికా పార్లమెంట్‌లో కీలక బిల్లు


హిందువుల పండుగ దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించేలా కాంగ్రెస్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు న్యూయార్క్‌కు చెందిన కరోలిన్ బి మలోనీ నేతృత్వంలో చట్టసభ సభ్యులు బుధవారం ప్రకటించారు. ‘దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించే చట్టం రూపొందించే కాంగ్రెస్‌లోని భారత సంతతి సభ్యులతో కలిసి ఈ వారం దీపావళి డే యాక్ట్‌ను ప్రవేశపెడుతున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను’ అని మలోనీ అన్నారు. చారిత్రాత్మక చట్టానికి భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా అనేక మంది చట్టసభ సభ్యులు మద్దతుగా నిలిచారు. దీపావళి మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను గుర్తిస్తూ కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌లో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ ఏడాది దీపావళి కోవిడ్-19 చీకటి నుంచి దేశం నిరంతర ప్రయాణానికి ప్రతీక అని మలోనీ వ్యాఖ్యానించారు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానాన్ని సాధించడాన్ని మనం ప్రతిరోజూ జరుపుకుంటున్నట్లుగా మీతో జరుపుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను.. ఈ ఏడాది దీపావళి ప్రజలపై భయంకర ప్రభావం చూపిన కోవిడ్-19 మహమ్మారి చీకట్ల నుంచి మన దేశం నిరంతర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘దీపావళి వంటి వేడుకలు అనిశ్చితి సమయంలో ఆనందం, స్వస్థత, వెలుగు దారి చూపేలా ఉండాలని మనమందరం కోరుకునే ప్రధానాంశాన్ని తెలియజేస్తాయి. నా సహచరులు భారతీయ సంతతి సభ్యులతో కలిసి భయంకరమైన మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దీపావళిని జాతీయ సెలవుదినంగా మార్చడానికి మంచి సమయం మరొకటి లేదని నమ్ముతున్నాను’ అని మలోనీ అన్నారు. కాగా, ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గ్రొగరీ మీక్స్ ఈ బిల్లును సమర్దించారు. ‘ఇది అమెరికా సమాజంలో మనందరితో పంచుకోవాల్సిన విషయం.. దీని గురించి ఏమిటంటే ఇది మంచి రోజు.. ఎందుకంటే మనం చీకటిపై వెలుగు గురించి మాట్లాడుతున్నాము.. ఈ బిల్లుకు విదేశీ వ్యవహారాల కమిటీ మద్దతు ఇస్తుంది’ అని అన్నారు. ‘ఈ దీపావళి పర్వదినం గురించి మనం చెప్పాలి.. ప్రపంచంలో చూడాలనుకునే కాంతిగా.. చీకటిని పారద్రోలడానికి అవసరమైన మన సమాజంలో వెలుగుగా... నిస్సహాయులకు ఆశలు కలిగించే ఈ సమాజంలో వెలుగుగా ఉందాం.. అన్ని వర్గాలకు సహాయపడే వెలుగుగా ఉండటం.. దీపావళి అంటే అదే. అందుకే దీపావళికి జాతీయ సెలవు దినం కావాలి’ అని భారత సంతతి చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.


By November 04, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/bill-introduced-in-us-congress-to-declare-hindu-festival-diwali-as-federal-holiday/articleshow/87520163.cms

No comments