Breaking News

COP26 Summit 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్.. ఐదు లక్ష్యాలను ప్రకటించిన మోదీ


2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi Cop26 Speech) ఉద్ఘాటించారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఐరాస వాతావరణ సదస్సు (COP26 Summit)లో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కట్టడికి పారిస్ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని మోదీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్ ఎంతో శ్రమిస్తోందని.. దాని ఫలితాలు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. ‘పారిస్ ఒప్పందంలో తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన పెద్ద ఆర్థిక వ్యవస్థ గల ఏకైక దేశం భారత్ అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. వాతావరణ మార్పుల కట్టడి కోసం అన్ని ప్రయత్నాలను దృఢ నిశ్చయంతో చేస్తున్నాం.. మేం దీనికోసం ఎంతో శ్రమిస్తున్నాం.. దీని ఫలితాలను త్వరలోనే చూపిస్తాం’ వ్యాఖ్యానించారు. భారత్ తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్ర స్థానంలో ఉంచుతోందని మోదీ తెలిపారు. రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు .వాతావరణ మార్పుల కోసం ఐదు లక్ష్యాలను భారత్ నిర్దేశించుకుందని మోదీ ఈ సదస్సులో వెల్లడించారు. తద్వారా వాతావరణ మార్పుల కట్టడిలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. ‘2030 నాటికి శిలాజేతర ఇంధన వినియోగాన్ని 500 గిగా వాట్లకు భారత్ పెంచుతుంది.. భారత్ తన ఇంధన అవసరాలలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచి పొందుతుంది... ఇప్పటి నుంచి 2030 నాటికి భారత్ తన కర్బన ఉద్గారాలను 100 కోట్ల టన్నుల మేర తగ్గిస్తుంది... భారత్ తన ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల కోసం చేస్తున్న ఖర్చును 45 శాతం మేర తగ్గించుకుంటుంది.. 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్ అవతరిస్తుంది. ఈ ఐదు చర్యలు.. వాతావరణ మార్పుల కట్టడిలో అద్భుత పాత్ర పోషిస్తాయి’ అని మోదీ అన్నారు. కాలుష్య నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారమని మోదీ సూచించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి ధ్యేయం కావాలని ప్రపంచ నేతలకు ప్రధాని పిలుపునిచ్చారు. ప్రకృతితోనే మానవ జీవితాలు ముడిపడి ఉన్నాయని... వాతావరణ మార్పులు మన జీవన విధానంపై మార్పులు చూపుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పుల కట్టడి కోసం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.


By November 02, 2021 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-surprises-cop26-summit-with-2070-zero-emmision-vow-for-india/articleshow/87480205.cms

No comments