ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లయిన నాలుగు రోజులకే నవదంపతుల మృతి
పెళ్లయిన నాలుగు రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కొత్త జంట ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న భారీ వాహనం ఢీకొట్టింది. తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. రాణిపేట జిల్లా అరక్కోణంకు చెందిన మనోజ్‌కుమార్‌కు (31), డాక్టర్ కార్తీకతో (30) అక్టోబర్ 28న వివాహం జరిగింది. ఈ నవదంపతులిద్దరూ ఆదివారం చెన్నైలోని కార్తీక ఇంటికి వచ్చారు. సోమవారం చెన్నై నుంచి మనోజ్కుమార్ స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యలో పూనమల్లే-అరక్కోణం జాతీయరహదారిపై కడంబత్తూరు సమీపంలోని వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన కాంక్రీట్ మిక్సర్ వాహనం ఢీకొట్టింది. ట్రక్ వేగంగా రావడంతో ప్రమాదం తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులోని మనోజ్, కార్తీకలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మప్పేడు పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనంలో నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తిరువల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వధువు కార్తీక తంబారమ్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
By November 02, 2021 at 11:51AM
No comments