Chhattisgarh సహచరులపై కాల్పులు జరిపిన సీఆర్పీఎఫ్ జవాన్.. నలుగురు మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన సహచరులపైనే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లా మారాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి 50వ బెటాలియన్ బేస్క్యాంప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపావళి అనంతరం సెలవుల విషయంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తింది. రితేశ్ రంజన్ అనే జవాన్ మిగిలిన వారిపై కాల్పులు జరపగా... ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో మరొకరు మృతిచెందారు. కాల్పులు జరిపిన జవాన్ రితేశ్ రంజన్ను సీఆర్పీఎఫ్ కస్టడీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు జవాన్లను మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో హైదరాబాద్ తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, పశ్చిమ బెంగాల్కు చెందిన రాజీవ్‌మండల్, ధర్మేందర్‌గా గుర్తించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం జవాన్ల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని బస్తర్ రేంజ్ ఐసీ సుందరరాజ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. బస్తర్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ఓ జవాన్ సహచరులపై జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. ఇంకొకరు గాయపడ్డారు. అనంతరం అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
By November 08, 2021 at 11:46AM
No comments