Breaking News

ఛీత్కారల నుంచి పద్మశ్రీ స్థాయికి.. రాష్ట్రపతికి దిష్టితీసి ఆశీర్వాదించిన ఈమె ఎవరు?


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తన చీర కొంగుతో దిష్టి తీసి ఆశీర్వదిస్తున్న ఈమె పేరు . ఈ ఏడాది పద్మ అవార్డు అందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్ ఇమె. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకునేందుకు వచ్చిన మంజమ్మ.. దేశ ప్రథమ పౌరుడిని ఇలా ఆశీర్వదించారు. పురస్కారాలు అందిస్తున్న మందిరంలో ఉన్న వారందరినీ ఈ సన్నివేశం ఉత్సాహ పరిచింది. ప్రముఖుల మోముపై నవ్వులు పూయించింది. ఆ తర్వాత అదే చిరునవ్వుతో మంజమ్మ తన అవార్డును స్వీకరించారు. కానీ, మంజమ్మ నవ్వుల వెనుక ఎంతో మందికి తెలియని కష్టాలున్నాయి. కన్నవాళ్లే ఆమెను కాదని వెలివేశారు. సమాజం ఛీ అని చీదరించుకుంది. కడుపు నింపుకోవడం కోసం ఆమె రోడ్లపై చేతులు చాచి యాచించారు. ఐనా, కుంగిపోలేదు. అవమానాలన్నింటినీ పంటి బిగువన భరించారు. చివరికి తనలోని కళను బయటపెట్టి.. ఇవాళ యావత్ భారతీయులతో జేజేలు అందుకుంటున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జన్మించిన మంజమ్మ జోగతి అసలు పేరు మంజునాథ శెట్టి. తనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తన శరీరంలో అనూహ్య మార్పులను గమనించాడు మంజునాథ. తాను అబ్బాయి కాదు, అమ్మాయి అని గుర్తించాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు అబ్బాయి కాదని తెలిసిన మంజునాథ అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చేసేదేం లేక అతడిని ఏమీ తెలియని వయసులో ‘జోగప్ప’గా మార్చారు. జోగప్ప అనేది అతి పురాతన హిజ్రాల వర్గం. వీరు దేవుడిని పెళ్లి చేసుకున్నట్లు భావించి తమ జీవితాన్ని దేవుడికే అంకితమిస్తారు. అలా మంజునాథ శెట్టి కూడా దేవుడిని పెళ్లి చేసుకొని మంజమ్మ జోగతిగా మారారు. ఐతే, నాటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమెను తమ కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. తాను హిజ్రా అని తెలియగానే కుటుంబసభ్యులు వెలివేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మంజమ్మకు ఎక్కడా పని దొరకలేదు. దీంతో కడుపు నింపుకోవడం కోసం మిగతా హిజ్రాల మాదిరిగా చీర కట్టుకొని వీధుల్లో భిక్షమెత్తుకున్నారు. ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక దశలో లైంగిక వేధింపులు భరించలేక విషం తాగి చనిపోవాలకున్నారు. కానీ, ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత జరిగినా 20 మంది తోబుట్టువులతో పాటు ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు కనీసం ఆసుపత్రికి కూడా రాలేదు. ఇది ఆమెను మరింత కుంగదీసింది. ఓ తండ్రి కొడుకుల సాయంతో మంజమ్మ తనలోని కళను గుర్తించారు. కాలవ్వ జోగతి అనే కళాకారిణి వద్ద జోగతి నృత్యం నేర్చుకున్నారు. కాలవ్వ బ్రుందంలో చేరి రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కాలవ్వ మరణం తర్వాత ఆ బ్రుందానికి తానే నాయకత్వం వహించారు. అంతేకాదు.. జోగతి నృత్యానికి ప్రజాదరణ తీసుకురావడానికి కృషి చేశారు. ఇప్పుడదే ఆమెకు పద్మ అవార్డును తెచ్చిపెట్టింది. కర్ణాటక ప్రభుత్వం 2010లో మంజమ్మను రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 2019లో కర్ణాటక జానపద అకాడమీకి ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి ఉన్నత పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్ మంజమ్మే. తన ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా కృషి చేస్తానని మంజమ్మ అన్నారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్‌ పిల్లలను ఆదరించాలని, ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆమె ఉద్వేగభరితంగా చెప్పారు.


By November 12, 2021 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/transgender-folk-dancer-manjamma-jogati-shares-what-led-to-her-padma-shri-win/articleshow/87660092.cms

No comments