Breaking News

పిల్లలకు వ్యాక్సిన్.. బూస్టర్ డోస్‌పై కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కీలక ప్రకటన


కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌లు, బూస్టర్‌ డోసుల పంపిణీ ప్రక్రియను వేగవంతంపై చేయడంపై కూడా దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసులు, చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ కీలక ప్రకటన చేసింది. దేశంలో బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా.ఎన్‌కె అరోరా సోమవారం వెల్లడించారు. అలాగే 44 కోట్ల మంది చిన్నారులకూ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ‘బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని తీసుకురానుంది.. ఎవరికి ఈ డోసులు అవసరం? ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తదితర విషయాలను ఇందులో పొందుపర్చనుంది.. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ కూడా వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అరోరా చెప్పారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ విషయమై మాట్లాడుతూ.. ‘18 ఏళ్లలోపు ఉన్న 44 కోట్ల మందికి టీకాలు వేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాం. దీన్ని త్వరలోనే ప్రకటిస్తాం.. అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు ప్రాధాన్యం ఉంటుంది. జైకోవ్‌-డీ, కొవాగ్జిన్‌, కార్బివ్యాక్స్‌ టీకాలు వేస్తాం.. అందరికీ సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి’ అని వెల్లడించారు. బూస్టర్‌ డోసు, అదనపు డోసు మధ్య తేడా ఉందని డాక్టర్ అరోరా వివరించారు. ‘రెండు డోసుల అనంతరం నిర్ణీత వ్యవధిలో బూస్టర్‌ డోసు ఇస్తారు. రెండు డోసులు వేయించుకున్న తర్వాత కూడా రోగనిరోధక శక్తిలేని వారికి మాత్రమే ఇచ్చేది అదనపు డోసు’ అని పేర్కొన్నారు. అయితే, బూస్టర్ డోస్‌పై మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇజ్రాయేల్, ఐరోపా లేదా ఉత్తర అమెరికాలు ఏదైతే చేస్తున్నాయో అది భారత్‌లో ఆచరణీయం కాదు’’ అన్నారు. ‘దేశంలోని 67 శాతం మంది ప్రజల్లో ఇన్‌ఫెక్షన్, సహజ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించిన ఆధారాలు ఉణ్నాయి.. ఇంకా చెప్పాలంటే, అక్టోబర్ డేటా ప్రకారం.. పిల్లలతో సహా భారతదేశ జనాభాలో 80-85% పెద్దలు టీకాలు తీసుకున్నందున సహజ ఇన్‌ఫెక్షన్‌ను చూపుతున్నారు.. దీనర్థం మన జనాభాలో చాలా ఎక్కువ భాగం ఇప్పటికే ఇన్ఫెక్షన్ బారిన పడింది... కొనసాగుతున్న టీకా ప్రక్రియ భారత పౌరులకు అదనపు రక్షణను అందించడానికి సహకరిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘దీపావళి, దసరా వంటి పండుగ సమయంలోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం దేశంలోని ప్రజల రోగనిరోధక శక్తి సాక్ష్యం స్పష్టమైంది.. 94 కోట్ల బూస్టర్ డోస్‌లపై నిర్ణయం కూడా రాత్రికి రాత్రే జరిగిపోదు.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ గురించి తీవ్ర భయాందోళనలపై ఆధారపడి ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.


By November 30, 2021 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/israel-europe-models-not-for-india-covid-panel-chief-says-booster-dose/articleshow/87995644.cms

No comments