Breaking News

కర్తాపూర్ సాహిబ్ వద్ద ఫోటోషూట్.. విమర్శలతో దిగివచ్చిన పాకిస్థాన్ మోడల్!


సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్‌‌‌తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వస్త్ర సంస్థ మన్నత్‌ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్‌ చేసింది. ఇందులో నటించిన మోడల్‌ తలపై వస్త్రం ధరించకుండా షూట్‌లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వివాదం మొదలయ్యింది. సిక్కులు ఈ ప్రకటనపై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్‌ షూట్‌ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్‌ స్పాట్‌ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శిరోమణి అకాళీ దల్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా కోరారు. ‘శ్రీ గురునానక్ దేవ్ జీ పవిత్ర స్థలంలో ఇటువంటి ప్రవర్తన.. చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదు! ఆమె పాకిస్థాన్‌లోని తన మత స్థలంలో కూడా అలా చేయడానికి ధైర్యం చేయగలదా? పాక్ ప్రభుత్వం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. కర్తాపూర్ కారిడార్‌ సాహిబ్‌ను పాక్ ప్రజలు పిక్నిక్ స్పాట్‌గా పరిగణించే ఈ ధోరణిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి’ అని కోరారు. ఈ వివాదంపై పాక్ మంత్రి పవాద్‌ చౌదరి స్పందించారు. మన్నత్ దుస్తుల కంపెనీ, మోడల్‌ తమ చర్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటు, వివాదం తీవ్రం కావడంతో మన్నత్‌ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాదు ‘‘సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఫోటోలను కర్తార్‌పూర్‌ కారిడార్‌ వద్ద తాము ఫోటో షూట్‌ చేయలేదని.. థర్డ్‌ పార్టీ తమ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్‌ షూట్‌ చేశారని’’ వివరణ ఇచ్చింది. మోడల్ సులేహా సైతం తాను ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశంతో చేయలేదన్నారు. కార్తాపూర్ కారిడార్‌ దర్శించుకున్న సందర్బంగా అదో జ్ఞాపకంగా ఉండాలనే ఫోటోలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశాను.. అది షూట్‌లో లేదా మరేదైనా భాగం కాదు.. నేను చరిత్ర, సిక్కు సమాజం గురించి తెలుసుకోవడానికి కర్తార్‌పూర్‌కి వెళ్లాను. ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి లేదా దేని కోసమో చేయలేదు.. నేను అక్కడి సంస్కృతిని గౌరవించనని అనుకుంటూ ఎవరినైనా బాధపెట్టినట్లయితే నన్ను క్షమించండి’ అన్నారు.


By November 30, 2021 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-model-suleha-apologises-after-row-over-photoshoot-at-kartarpur-sahib/articleshow/87996361.cms

No comments