ఒమ్రికాన్ అత్యంత ప్రమాదకారి.. ప్రపంచానికి పెను ముప్పు.. హెచ్చరించిన WHO
దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచ ఆరోగ్య సంస్థ () మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలన్నింటికీ అప్రమత్తత లేఖను జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన వేరియంట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని తెలిపింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే మహమ్మారులపై ఉమ్మడిగా పోరాడేందుకు అంతర్జాతీయ సమాజం తోడ్పాటు అందించాలని... ఇందుకు నూతన ఒప్పందం అవసరమన్న విషయాన్ని కొత్త వేరియంట్ చాటిచెబుతోందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నోమ్ ఘ్యాబ్రియోసిస్ పునురుద్ఘాటించారు. వేరియంట్ ప్రమాదకరమని భావిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. భవిష్యత్తులో మహమ్మారులపై పోరాటానికి అవసరమైన ‘ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. మహమ్మారులపై అంతర్జాతీయ ప్రతిస్పందనలను పెంచేలా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మహమ్మారులు తలెత్తినప్పుడు ప్రపంచ ప్రతిస్పందనను పెంచేలా, సభ్య దేశాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండేలా దీన్ని ప్రతిపాదించారు. అవసరమైన వైద్య ఆరోగ్య సేవలను నిర్వహించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఉపశమన ప్రణాళికల ద్వారా సభ్య దేశాలు సిద్ధం కావాలని అథ్నోమ్ కోరారు. డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వేరియంట్ వ్యాపిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఒకవేళ ఒమిక్రాన్ మరో పెద్ద ఉప్పెనకు దారితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీకాలు, గతంలో వైరస్ బారినపడ్డప్పుడు వచ్చిన రోగనిరోధక శక్తిని కొత్త వేరియంట్ తప్పించుకుంటుదఅనే అవగాహనకు మరింత పరిశోధన అవసరమని నొక్కిచెప్పారు. ఇప్పటికే ఈ వేరియంట్ 14 దేశాలకు వ్యాపించగా.. బెంగళూరులోనూ ఒకరికి నిర్ధారణ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
By November 30, 2021 at 08:32AM
No comments